సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీలో మరో గలీజు దందా వెలుగులోకి వచ్చింది..సంస్థ ఆస్తులను తక్కువ మొత్తానికి లీజు తీసుకోవడం..ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల అండతో అక్రమంగా తిష్టవేసి బల్దియా ఖజానాను కొల్లగొట్టడం కొందరికి పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే మాసబ్‌ట్యాంక్ చాచా నెహ్రూ పార్కులో ఓ అక్రమార్కుడి బాగోతంలో స్పోర్ట్స్ విభాగం అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది.
33 ఏండ్లుగా తిష్ట వేసి రూ.1.4కోట్ల బకాయి పడిన యథేచ్ఛగా కొనసాగించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ పేరుతో మాసబ్‌ట్యాంక్ చాచా నెహ్రూ పార్కులో స్పోర్ట్స్ ప్లే గ్రౌండ్ 1992 సంవత్సరంలో పదేండ్ల పాటు లీజు పద్ధతిలో కేవలం రూ.100ల చొప్పున తీసుకున్నారు. ఆ తర్వాత మరో ఐదేండ్ల పాటు సదరు ఏజెన్సీకి పొడిగించారు. అనంతరం మూడేళ్ల పాటు 2010 అవకాశం కల్పించారు. ఈ సమయంలో ఏడాది చొప్పున రూ.75వేలు , ఆ తర్వాత 2019 సంవత్సరం వరకు అనధికారికంగా కొనసాగుతూ వచ్చారు.
అప్పటి అధికారులు సదరు ఫౌండేషన్‌కు షోకాజ్ నోటీసు పంపించారు. 2019 సంవత్సరంలో రూ.27 లక్షలు బకాయి పడగా..చెల్లింపులు జరపక లేదు..ఐతే ఎంఐఎం నేతలు,ఐఏఎస్‌ల అండదండలతో సదరు ఏజెన్సీ అధికారులపై ఒత్తిడి పెంచి యథేచ్ఛగా కొనసాగాడు. కొందరు ఐఏఎస్ పిల్లలకు ఉచితంగా స్పోర్ట్స్‌పై శిక్షణ ఇచ్చి..వారి ప్రమేయంతో గలీజు దందా చేపట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే 2019 నుంచి 15 శాతం వడ్డీతో కలిపి 31 ఆగస్టు 2025 వరకు రూ.1.4 కోట్ల రూపాయిల బకాయి వేస్తూ వచ్చారు. చివరకు నేడు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందుకు ఈ అంశాన్ని ఎజెండాగా చేర్చారు. సదరు ఏజెన్సీని లీజును రద్దు చేసి బకాయిని వసూలు చేస్తారా? ఈ విషయంలో సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే..