Medchal | మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇద్దరు దొంగలు జగదాంబ బంగారం షాపులోకి చొరబడి.. బంగారం, నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యజమానిపై కత్తితో దాడి చేశారు. ఇద్దరిలో ఒక దొంగ బుర్ఖా ధరించగా, మరొక దొంగ హెల్మెట్ ధరించి ఉన్నాడు.
అయితే బంగారం దుకాణం యజమాని ధైర్యంతో దొంగల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి వచ్చాడు. దొంగలు దొంగలు అని అరవడంతో.. దొంగలిద్దరూ బయటకు పరుగెత్తుకు వచ్చి అతనిపై మరోసారి దాడి చేసేందుకు యత్నించారు. అయితే దుకాణం లోపల ఉన్న ఓ యువకుడు కుర్చీ తీసుకొని పరుగెత్తుకొచ్చి.. బైక్పై పారిపోయేందుకు యత్నించిన దొంగలపై విసిరాడు. కానీ వారు తప్పించుకుపోయారు.
ఈ ఘటనపై బాధిత యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే దొంగలు బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధిత యజమాని తెలిపాడు.