DCP Chaitanya | హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. సామాన్యులపైనే కాదు.. శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని రౌడీలు, దొంగలు దాడులకు పాల్పడుతున్నారు. మొన్న నిజామాబాద్ జిల్లాలో ప్రమోద్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ ఇద్దరు సెల్‌ఫోన్ దొంగలు.. ఏకంగా సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్‌పై కత్తితో దాడి చేసేందుకు యత్నించారు.
ఇవాళ హైదరాబాద్ సీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం చైతన్య తిరిగి తన కార్యాలయానికి వస్తున్నారు. చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్దకు రాగానే ఓ ఇద్దరు దొంగలు సెల్ఫోన్లను చోరీ చేసి పారిపోతున్నారు. ఆ సెల్‌ఫోన్ స్నాచర్స్‌ను గమనించిన డీసీపీ చైతన్య తన గన్‌మెన్‌ను అప్రమత్తం చేశారు. డీసీపీ, గన్‌మెన్ కలిసి ఆ ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో దొంగలు.. డీసీపీపై కత్తితో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దొంగలను గన్‌మెన్ అడ్డుకునేందుకు యత్నించాడు. కానీ తోపులాటలో గన్‌మెన్ కింద పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన డీసీపీ చైతన్య.. గన్‌మెన్ వద్ద ఉన్న వెపన్‌ను తీసుకుని దొంగలపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇద్దరిలో ఒక దొంగకు తీవ్ర గాయాలయ్యాయి. దొంగకు ఛాతి, వెన్ను భాగంలో గాయాలు కావడంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
కాల్పులు చోటు చేసుకున్న విక్టోరియా గ్రౌండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఘటనాస్థలిని సౌత్, సెంట్రల్ జోన్ డీసీపీలు స్నేహామెహ్రా, శిల్పావళితో పాటు పలువురు సీఐలు, ఎస్సైలు పరిశీలించారు. దొంగతో జరిగిన తోపులాటలో డీసీపీ చైతన్య కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో డీసీపీని నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.