అమీర్‌పేట్, జనవరి 21: బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న ఆకర్షణ(13) ఢిల్లీలోని కర్తవ్య్ పథ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నారు. ఈ మేరకు ప్రసారభారతి నుంచి వచ్చిన ఆహ్వానలేఖ ఆమెకు అందింది. ఢిల్లీలో జరిగే వేడుకలకు తెలంగాణ నుంచి మొత్తం 5 మందికి ఆహ్వానాలు అందగా, వారిలో ఆకర్షణ సతీష్ అతి పిన్న వయస్కురాలు.
ఢిల్లీలో గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఆకర్షణకు వరుసగా ఇది రెండోసారి. తాను సేకరించిన పుస్తకాలతో తెలంగాణ, తమిళనాడుల్లో 18కి పైగా గ్రంథాలయాలను నెలకొల్పిన ఆకర్షణ గురించి ప్రధాని మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాగా, హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో భాగంగా ‘ఎట్ హోమ్’కు కూడా ఆకర్షణ ఆహ్వానం అందుకున్నారు.