సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ ) : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. పదకొండు ఎజెండాలను స్టాండింగ్ కమిటీ ముందు ప్రతిపాదన సిద్ధం చేశారు. ప్రధానంగా 11 చెరువుల పరిరక్షణ, అధ్యయనం, నిర్వహణ బాధ్యతలను నీరి సంస్థకు అప్పజెప్పాలని ప్రతిపాదించారు. బండ్లగూడ క్రాస్ సమీపంలో రూ.212 లక్షలతో 1600 ఎంఎం డయా ఎంఎస్ పైపులైన్ పనులను ఆమోదించనున్నారు.
సీఎస్ఆర్లో భాగంగా గోపన్‌పల్లిలోని సర్వే నంబర్ 34లో 4,350 స్కేర్ యార్డ్స్‌లో యానిమల్ హాస్పిటల్ ఫ్యాకల్టీ ఏర్పాటు, 25 ఏండ్ల నిర్వహణ బాధ్యతలు రాంకీ ఫౌండేషన్‌కు అప్పగించనున్నారు. డబీర్‌పురా పోలీస్ స్టేషన్ నుంచి నాగబౌలి జంక్షన్ వరకు రూ. 510 లక్షలతో రహదారి విస్తరణ, అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ మూడేండ్ల పాటు సీఎస్ఆర్ పద్ధతిలో జూబ్లీహిల్స్ రోడ్ నం 36 బ్యాంబు పార్కును అభివృద్ధి చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకోనున్నారు.
మరికొన్ని చోట్ల రహదారి విస్తరణలో భాగంగా 269 ఆస్తుల స్వాధీనం చేసుకునేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదించనున్నది. వీటిన్నింటికంటే ముఖ్యంగా వ్యాపారస్తుల నుంచి ముక్కుపిండి వసూలు చేసి ఖజానాను నింపుకునే మరో కీలక ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీ ముందుకు ప్రకటనల విభాగం తీసుకువస్తున్నది. వ్యాపారస్తులు తమ షాపుల ముందు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ డిజిటల్ బోర్డుల నుంచి ప్రతి ఏటా ఫీజులు వసూలు చేయనున్నది.
మూడు కేటగిరీల్లో భాగంగా ఎస్ కేటగిరిలో రూ. 5500, ఏ కేటగిరిలో రూ.5500, బి కేటగిరిలో రూ. 5250, సీ కేటగిరిలో రూ.5వేల ఛార్జీలు వసూలు చేయనున్నది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా వసూళ్లను రాబట్టనున్నది. ఖాజాగూడ జంక్షన్, ఐఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీని నివారణకు శాశ్వత చర్యల్లో భాగంగా మల్టీలెవల్ ఫ్లై ఓవర్, రహదారి విస్తరణకు.. 749 కోట్లతో హెచ్ సిటీ ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు టెండర్ల అనుమతికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తీసుకోనున్నారు.