చార్మినార్, ఎప్రిల్ 15 : మహిళా పోలీస్ అధికారులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి కావాల్సిన మౌలిక వసతులను కల్పించడానికి కృషి చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం పోలీస్ సీఏఆర్ హెడ్ క్వార్టర్లో ఎంఈఈఐఎల్ సంస్థ సౌజన్యంతో నిర్మించనున్న భవన నిర్మాణానికి సంస్థ ప్రతినిధులు, ఇతర అధికారులతో కలిసి సీపీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ… మహిళా సిబ్బంది విధుల నిర్వహణలో ఒకింత ఆందోళనకు గురవుతున్న విషయాన్ని ఇటీవల గుర్తించామన్నారు. దానికి కారణం ఇంటి వద్ద వారి చిన్నారుల బాగోగులు ఎలా ఉన్నాయో.. ఆ చిన్నారులు ఏమి చేస్తున్నారోననే దిగులు వారిని విధుల్లో చురుకుగా పని చేయకుండా అడ్డంకులు కలిగిస్తున్నదనే విషయాన్ని గ్రహించామని చెప్పారు. ఆ సమస్యలను అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఎంఈఈఐఎల్ నిర్మాణ సంస్థ పోలీస్ విభాగానికి చేయూతనందించడానికి ముందుకు వచ్చిందన్నారు. మెయిల్ సంస్థ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కేంద్రంలో భవన నిర్మాణానికి ముందుకు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. జీ ప్లస్ వన్ భవన నిర్మానం కోసం రూ.4 కోట్ల 50 లక్షలతో ఆధునిక హంగులతో 12వేల చదరపు అడుగులు ఆవరణతో చిన్నారుల భద్రత కోసం వసతుల కల్పన చేస్తున్నారని తెలిపారు. సిటీ ఆర్డ్ తో పాటు 600 మంది మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, వారి సౌలభ్యంతో పాటు దక్షిణ, దక్షిణ తూర్పు, దక్షిణ పశ్చిమ జోన్ల సిబ్బంది సైతం ఈ కేంద్రాన్ని వినియోగించుకునేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. భవిష్యత్తులో పోలీసుల సంక్షేమానికి మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తామని మెగా ఇంజినీరింగ్ సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో మెయిల్ సంస్థ డైరెక్టర్లు రవి పీ రెడ్డి, పామిరెడ్డి రామారెడ్డి, మంజలి రెడ్డి, అడిషనల్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీ ఎం.శ్రీనివాస్, దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య, డీసీపీ శిరీషతోపాటు చార్మినార్ ఏసీపీ రుద్రభాస్కర్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ గురునాయుడు పాల్గొన్నారు.