సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): ‘నా వద్ద కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు వంటి స్థిరాస్తులు ఉన్నాయి. నాకు ఆర్థికంగా సహాయం చేసే.. మీ పెట్టుబడికి రెట్టింపు రాబడి ఇస్తానం’టూ…ఓ కిలాడి లేడీ అమాయకులను మోసం చేసి.. వారి నుంచి రూ.3.06 కోట్లు దోచుకుంది. వివరాల్లోకి వెళితే….పనుగంటి ఇందిరాదేవిరెడ్డి(29) తనకు తాను ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకున్నది.
ప్రస్తుతం నాగోల్‌లో బ్యూటీపార్లర్‌తో పాటు దేవీ ఫుడ్స్ పేరుతో అదే ప్రాంతంలో ఫుడ్ ఇండస్ట్రీ కూడా నడుపుతున్నది. అంతే కాకుండా మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగి ప్రాంతాల్లోని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయని, నాగోల్‌లో ఒక అపార్ట్మెంట్ కూడా ఉన్నట్లు జనాలను నమ్మించింది.
ఆర్థిక సాయం కింద తన వద్ద పెట్టుబడి పెడితే రెట్టింపు రాబడి చెల్లిస్తానని నమ్మబలికింది. ఈ క్రమంలో పలువురు అమాయక ప్రజల నుంచి రూ. 3.06 కోట్లు వసూలు చేసింది. అంతటితో ఆగకుండా ఇద్దరు బాధితులకు చెందిన రెండు కార్లు సైతం తీసుకొని.. వారికి తెలియకుండానే తనాఖా పెట్టింది. పైగా తన ఇద్దరు స్నేహితులను పోలీసు అధికారులుగా బాధితులకు పరిచయం చేయించి.. వారి డబ్బుతో 2ఐఫోన్లు, ఓ వన్‌ప్లస్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసింది.
అయితే ఇందిరాదేవి బాగోతాన్ని తెలుసుకున్న బాధితులు.. డబ్బు, కార్లు తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో నిందితురాలు స్పందించకపోవడమే కాకుండా కేసులు పెట్టిస్తానంటూ బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టింది. దీంతో మదీనాగూడకు చెందిన ఎస్. సత్యనారాయణ తమకు జరిగిన అన్యాయంపై సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని. దర్యాప్తు చేసిన పోలీసులు.. బుధవారం ఇందిరాదేవిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే గతంలో కూడా నిందితురాలు ఇదే తరహా మోసాలకు పాల్పడటంతో మాదాపూర్ ఠాణాలో నిందితురాలిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆమెవద్ద నుంచి రెండు కార్లు, ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి, ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ పర్యవేక్షణలో వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు.