మైలార్‌దేవ్‌పల్లి, ఆగస్టు 6: కాటేదాన్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల బోల్తా పడింది. బస్సులో ఉన్న కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం సాయంత్రం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీ మణికంఠ హిల్స్‌లో పయనీర్ కాన్సెప్ట్ హై స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు సరైన రోడ్డు మార్గం లేదు.
గుంతలమయంగా రోడ్డు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం పాఠశాల ముగిసే సమయంలో బస్సు డ్రైవర్ ఆదిల్ బస్సును పాఠశాల ఆవరణలోని ఓ ఎత్తయిన ప్రదేశంలో నిలిపాడు. అనంతరం బస్సుకు హ్యాండ్ బ్రేక్ వేసిన ఆదిల్.. బస్సు దిగి కిందకు వెళ్లాడు. పాఠశాల సమయం ముగియడంతో విద్యార్థులు తమ ఇంటికి వెళ్లేందుకు ఆ బస్సు ఎక్కారు. అయితే, విద్యార్థులు ఆడుకుంటూ బస్సు హ్యాండ్ బ్రేక్‌ను తొలగించారు. దీంతో ఒక్కసారిగా బస్సు అతివేగంగా వెనక్కి వచ్చింది.
అక్కడే పార్కు చేసి ఉన్న ఓ ఇండికా కారును ఢీకొని బొల్తా కొట్టింది. బస్సులో ఉన్న విద్యార్థులు కేకలు వేయడంతో వెంటనే స్పందించిన స్థానికులు.. పిల్లలను బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారని, అందులో పలువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం జేసీబీ సహాయంతో బోల్తాపడిన బస్సును తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న చిన్నారులకు తీవ్ర గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిర్లక్ష్యంగా బస్సులు నడిపే డ్రైవర్లు, పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ప్రజలు కోరారు.
గాయాలకు గురైన విద్యార్థులు
పయనీర్ కాన్సెప్ట్ స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇందులో 6వ తరగతి చదువుతున్న ఎన్.అభిషేక్, 7వ తరగతి చదువుతున్న దీపక్, ఎం.జేష్, కాతీఫ్, విశాల్, ఆకృతి, 8వ తరగతి చదువుతున్న భాగ్యలక్ష్మి, 9వ తరగతి చదువుతున్న ప్రభాకర్, కాషఫ్, నిహారిక, ఆయుషి, 10వ తరగతి చదువుతున్న వైష్ణవి ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థులను పరామర్శించిన..
ఈ ప్రమాదంలో గాయాలకు గురైన విద్యార్థులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్, మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్, ఎంఈవో శరత్ రాథోడ్ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.