Hyderabad | బండ్లగూడ, ఏప్రిల్ 26: తన కుటుంబంలో జరుగుతున్న గొడవలలో బామ్మర్దులు జోక్యం చేసుకుంటున్నారని వారిపై కోపంతో ద్విచక్ర వాహనాన్ని దహనం చేసిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్ నగర్‌కు చెందిన అబ్దుల్ ఖాదర్ భార్యతో గత రాత్రి గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో ఖాదర్ బామ్మర్దులు జోక్యం చేసుకొని సర్ది చెప్పేవారు. రాత్రి జరిగిన గొడవలో బామ్మర్దులు అడ్డు రావడంతో వారిపై కోపంతో ఊగిపోయిన అబ్దుల్ ఖాదర్ దాడికి ప్రయత్నించాడు. ఇంటి వద్ద వారు లేకపోవడంతో ఇంటి బయట ఉన్న ద్విచక్ర వాహనానికి నిప్పంటించాడు. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న అబ్దుల్ ఖాదర్ భార్య తన భర్తతో తన తమ్ముళ్ళకి ప్రాణహాని ఉంది అని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.