హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): డిగ్రీలో కోర్సుల్లో చేరాలంటే గతంలో ఒక విద్యార్థి మూడు, నాలుగు కాలేజీలకు తిరిగి దరఖాస్తు చేసుకోవడం. ముందుగా కాలేజీలకెళ్లడం, దరఖాస్తులు కొనుగోలుచేయడం, జిరాక్స్ కాపీలను జతపర్చడం జరిగేది. మొదటి లిస్ట్, రెండు, మూడో డు లిస్ట్ తర్వాత స్పాట్ సెలెక్షన్స్.. ఇలా ప్రతీసారి కాలేజీకి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ కష్టాలకు చెక్‌పెడుతూ.. వన్ స్టాప్ సొల్యూషన్స్ చూపిస్తోంది డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్లాట్‌ఫాం. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు, అన్ని డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ వ్యవస్థ ఇది.
ఒకే ఒక్క బటన్‌తో ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవడం, సీట్లు పొందడం వంటి ప్రత్యేకతలు దీని సొంతం. అన్నింటిని ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి రాష్ట్రంలోని ఎక్కడి విద్యార్థి అయినా ఎక్కడైనా చదువుకునే అద్భుత అవకాశాన్ని దోస్త్ కల్పించింది. విప్లవాత్మక మార్పుగా ప్రవేశపెట్టిన దోస్త్ 2025 అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇటీవలే విడుదలయ్యింది. ఈ సారి మూడు విడుతల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 1,057 డిగ్రీ కాలేజీలుండగా 4,57,724 సీట్లున్నాయి.
ప్రభుత్వ కాలేజీల్లో పెరుగుతున్న విద్యార్థులు..
దోస్త్ ఆన్లైన్ ప్రవేశాల కారణంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్లు పెరుగుతున్నాయి. 2018లో అటానమస్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కేవలం 28వేల మంది మాత్రమే చేరగా, 2024కు వచ్చేసరికి 50,477 మంది విద్యార్థులు చేరారు. తాజాగా ఏర్పడ్డ చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలోని సీట్లను సైతం దోస్త్ ద్వారానే భర్తీచేస్తున్నారు. మొదటి విడుత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బుధవారంతో ముగియనుంది. ఈనెల 29న మొదటి విడుత సీట్లను కేటాయిస్తారు. అయితే కామర్స్ కోర్సు పట్లనే అత్యధికంగా విద్యార్థులు ఆసక్తిచూపిస్తున్నారు.
సెల్ఫీతో దరఖాస్తు..
సులభంగా దరఖాస్తుచేయడం, విద్యార్థులు ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో నుంచే మొబైల్ ద్వారా దరఖాస్తు చేసేందుకు దోస్త్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. కేవలం సెల్ఫీ తీసి ఫొటోను దోస్త్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే విద్యార్థి వివరాలు ప్రత్యక్షమయ్యేలా సాంకేతిక ఏర్పాట్లు చేశారు. ఇంటర్‌బోర్డు ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. టీయాప్ ఫొలియో రియల్ టైం ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా విద్యార్థి వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఇదేకాకుండా ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్, తల్లిదండ్రుల మొబైల్ నెంబర్, మీసేవా కేంద్రాల ద్వారా సైతం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
2020-21 నుంచి బకెట్ సిస్టం..
దోస్త్‌లో భాగంగా 2020-21 సంవత్సరం నుంచి బకెట్ సిస్టంను ప్రవేశపెట్టారు. దీంతో కోర్సుల స్వరూపమే మారిపోయింది. దీంతో ఇదివరకు బీఎస్సీ బాటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్ వంటి సబ్జెక్టులు చదివినవారు.. కొత్తగా సైకాలజీ చదివే అవకాశం వచ్చింది. అంతేకాకుండా గణితం, స్టాటిస్టిక్స్ విద్యార్థులు ఎకనామిక్స్‌ను చదవొచ్చు. ఇలా వినూత్న కాంబినేషన్లు బకెట్ సిస్టం ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానంలో ఒక్క బేగంపేట మహిళా కాలేజీలో 56రకాల కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. సిటీ కాలేజీలోను 50కి పైగా సబ్జెక్టు కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి.
మారనున్న సిలబస్..
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల సిలబస్ మారనుంది. ఇప్పుడున్న సిలబస్‌లో 10-15శాతం సిలబస్‌ను మార్చనున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ అన్న తేడాల్లేకుండా అన్ని కోర్సుల సిలబస్‌ను మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగాల కల్పన, పరిశ్రమలతో అనుసంధానం, ఇంటర్న్‌షిప్‌లు వంటి వాటిని ప్రాధాన్యతాంశాలుగా తీసుకుంటున్నారు. ఈ ఏడాది 28 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అప్రెంటిస్‌షిప్ ఎంబీడెడ్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. బీకాం బీఎఫ్ఎస్ఐ, బీకాం ఈకామర్స్ అపరేషన్స్, బీకాం రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ టూరిజం హాస్పిటాలిటీ, బీఎస్సీ డిజిటల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ మార్కెటింగ్ అండ్ సేల్స్, బీఎస్సీ ఫార్మాస్టూటికల్ మ్యాన్యుఫ్రాక్చరింగ్ అండ్ క్వాలిటీ, బీబీఏ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్ కోర్సులను ఈ 28 డిగ్రీ కాలేజీల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కోర్సులన్ని పరిశ్రమ ఆధారితమైనవే. ఈ కోర్సుల్లో చేరిన వారు సంబంధిత పరిశ్రమల్లో అప్రెంటిస్పిష్ చేయాల్సి ఉంటుంది.
దోస్త్ బాటలో ఐదు రాష్ర్టాలు..
తెలంగాణలో అమలు చేస్తున్న దోస్త్ ప్రయోగం యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నది. ఇప్పటికే ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ తరహా ఆన్లైన్ ప్రవేశాలను అమలుచేస్తుండగా, మరికొన్ని రాష్ర్టాలు సైతం ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ర్టాలు దోస్త్ తరహాలోనే అడ్మిషన్లు చేపడుతున్నాయి. మరికొన్ని రాష్ర్టాలు తెలంగాణలోని దోస్త్‌ను అధ్యయనం చేస్తున్నాయి. కాగా ఈ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
దోస్త్ ప్రత్యేకతలు..