మియాపూర్ , సెప్టెంబరు 13: టిఫిన్స్ ఆన్ టూ వీలర్(టాట్) అనే కొత్త జీవనోపాధి మార్గంతో ఆ యువకుల ప్రయత్నం ఆలోచింపజేస్తున్నది. అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచించి స్వయం ఉపాధి దిశగా ఆ యువత అడుగులు వేస్తున్నారు. హోటళ్లు, ఫుడ్ ట్రక్కులు, ఇండ్లలో తయారు చేసి విక్రయిస్తున్న ఆహార పదార్థాలను ఇప్పటి వరకు రహదారుల వెంట చూసాం. కానీ ఆ యువకులు ఇప్పటి వరకు లేని టూ వీలర్నే లైవ్ కిచెన్‌లా తయారు చేయించుకొని ‘టిఫిన్స్ ఆన్ టూ వీలర్’ (టాట్)తో తాజాగా మియాపూర్‌లో ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలపై ఆహార పదార్థాలు, ఉపాహారాల విక్రయాలు ప్రస్తుతానికి ఉన్నా…వినియోగదారులకు అందే వరకు అవి చల్లబడుతున్నాయి. కానీ వీరు టిఫిన్స్‌ను వినియోగదారుల ఎదుటే క్షణాల్లో తయారు చేసి అందిస్తారు. మియాపూర్ జాతీయ రహదారి పక్కనే రెండు రోజుల కిందటే ప్రారంభించిన ఈ టూ వీలర్ లైవ్ కిచెన్ వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తున్నది.
లైవ్ కిచెన్‌లో వేడి వేడి టిఫిన్స్…
ప్రత్యేకంగా లైవ్ కిచెన్‌లో ఆనియన్ , మసాలా, ఎగ్, ఉప్మా దోశలను అక్కడికక్కడే వేడివేడిగా తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నారు. సోమవారమే తమ టూ వీలర్ లైవ్ కిచెన్‌ను ప్రారంభించి మియాపూర్ జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 10.30 గంటల వరకు తమ లైవ్ కిచెన్ కొనసాగుతుందని నిర్వాహకులు హరీశ్, చైతన్య, అల్తాఫ్ తెలిపారు. ఏ టిఫిన్ అయినా రూ. 25 కే అందిస్తున్నారు. ఎక్కడ కస్టమర్స్ ఉంటే అక్కడ లైవ్ కిచెన్‌ను ఏర్పాటు చేసేలా అంతా సిద్ధం చేసుకున్నారు. కేవలం రహదారుల పక్కనే కాకుండా చిన్న చిన్న బడ్జెట్ ఫంక్షన్లకూ తమ ‘ టూ వీలర్ లైవ్ కిచెన్’ సేవలను అందిస్తామని ప్రధాన చెఫ్ చైతన్య తెలిపారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న తమ లైవ్ కిచెన్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నదని పేర్కొన్నారు. తమ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని ఆ యువకులు తెలిపారు.
ప్రణాళిక ఇలా…
శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్‌పేట్ , మియాపూర్ ప్రాంతాలకు చెందిన హరీశ్, చైతన్య(చెఫ్), అల్తాఫ్‌లు మిత్రులు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన హరీశ్, అల్తాఫ్‌లు మెడికల్ రిప్రజెంటేటివ్, ఇంటీరియర్ డిజైనర్లుగా పని చేస్తుండగా, చైతన్య మొదటి నుంచి హోటల్ నిర్వహణలో కొనసాగుతున్నారు. తమ తమ ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే మొబైల్ టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం టూ వీలర్ పై రహదారుల పక్కన కొనసాగుతున్న ఆహార పదార్థాల విక్రయాలను అధ్యయనం చేసి టూ వీలర్‌పై మొబైల్ కిచెన్‌ను తయారు చేయాలని తీర్మానించారు. అల్తాఫ్‌కు ఉన్న టీవీఎస్ హెవీ ద్విచక్ర వాహనమే ఇందుకు అనువని భావించి….తమ సొంత ఆలోచనతో టూ వీలర్ వెనక సీటుపై లైవ్ కిచెన్ మాదిరి వెల్డింగ్ చేయించారు. రెండు పొయ్యిలు, వాటిపై దోశ పెనాలను శాశ్వత ప్రాతిపదికన బిగించారు. ఇందుకోసం వారు రూ.8 వేలు ఖర్చు చేశారు. రెండు రోజుల పాటు శ్రమించి ఓ వెల్డింగ్ నిష్ణాతుడితో తాము అనుకున్న విధంగా టూ వీలర్‌పై లైవ్ కిచెన్‌ను సిద్ధం చేసుకున్నారు. వెనక సీట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దోశ పెనాలు రెండు, మరోవైపు ఇడ్లీ, వడ హాట్ ప్యాకులను పెట్టుకునేందుకు ఏర్పాటు చేశారు. నాలుగు వైపులా రేకుతో ప్లేట్లుగా ఏర్పాటు చేసి….దానిపై ‘టిఫిన్స్ ఆన్ టూ వీలర్’ (టాట్) అని రాయించారు.