అబిడ్స్, మే 20 : కండరాల బలహీనతతో మంచంపై నుంచి లేవ లేని స్థితిలో ఉన్న ఇద్దరు పిల్లలను పోషిస్తున్న కుటుంబానికి తెలంగాణ ఫ్రీ మేసన్ సభ్యులు ఆసరాగా నిలిచారు. ఘట్కేసర్లోని యమ్నాపేట్ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి, పద్మ దంపతుల ఇద్దరు కుమారులు తేజ వర్ధన్‌రెడ్డి, మణివర్ధన్‌రెడ్డి కండరాల బలహీనతతో మంచంపై నుంచి లేవలేని స్థితిలో ఉన్నారు. వారికి తల్లిదండ్రులు అన్ని సపర్యాలు చేయాల్సిన పరిస్థితి. కాగా రోజు కూలీ చేసుకుని జీవించే ఆ కుటుంబానికి పిల్లలను పోషించడంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గుర్తించిన తెలంగాణ ఫ్రీ మేసన్ సభ్యులు వారికి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గోషామహల్ బారాదారిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణలోని ఫ్రీ మేసన్స్ అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్లు ప్రొద్దుటూరు వీరభద్రుడు, డాక్టర్ శ్రీరంగ్ అబ్కారీ, అనిల్ దేశాయ్, రమేశ్ మంచాల పాల్గొని పిల్లల తల్లికి యాభై వేల రూపాయల చెక్కును అందజేయడంతో పాటు నెలవారి అవసరానికి అనుగుణంగా కిరాణా సరుకులను అందజేస్తామని హామీ ఇచ్చారు.
పిల్లలు జీవించి ఉన్నంత కాలం సరుకుల సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు వీరభద్రుడు మాట్లాడుతూ ఫ్రీ మేసన్స్ ఒక ప్రపంచ సంస్థ అని, విలువలను పెంపొందించే సంస్థ అన్నారు. గత వారం యమ్నాపేట్ గ్రామంలోని పద్మ, నర్సింహారెడ్డిల కుటుంబాన్ని సందర్శించి వారి పరిస్థితిని అధ్యయనం చేసి వారి అవసరాలను అంచనా వేసి ఫ్రీ మేసన్స్ కుటుంబాలు, స్నేహితులు, బంధువులు, వ్యాపార సహచరుల సహకారంతో డబ్బును స్వీకరించి బొక్క పద్మకు చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బొక్క పద్మతో పాటు ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తల్లి డాక్టర్ సత్యభామ, విమ్లా దుర్వేష్ అహీర్, బోయపాటి సుభాషిణిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫ్రీ మేసన్ సభ్యులు గన్నారపు అశోక్, ప్రాంతీయ గ్రాండ్ మాస్టర్ టీఎన్ మనోహరన్ తదితరులు పాల్గొన్నారు.