సిటీబ్యూరో, నవంబర్ 9(నమస్తే తెలంగాణ): విద్యుత్‌శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో విద్యుత్ కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పనులన్నీ పెండింగ్‌లో పడి బిల్లులు రాక తాము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని, గత ప్రభుత్వంతో తమకు ఇటువంటి ఇబ్బందులు రాలేదని తెలంగాణ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని హబ్సిగూడ కిన్నెర గ్రాండ్ హోటల్లో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో తెలంగాణలో కాంట్రాక్టర్లకు ఎదురవుతున్న ఇబ్బందులపై వాడీవేడిగా చర్చ జరిగింది.
అసోసియేషన్ అధ్యక్షుడు జీసీ.రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గాలపై సూచనలు చేయాలని రాష్ట్రకమిటీ తీర్మానించింది. విద్యుత్ స్టోర్లలో మెటీరియల్స్ అందుబాటులో ఉండడం లేదని, క్షేత్రస్థాయిలో పనులు చేసినా లైన్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో వినియోగదారుల నుంచి కాంట్రాక్టర్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నదని పలువురు కాంట్రాక్టర్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు లేకుండా టెండర్లు వచ్చేవని, కాంట్రాక్టర్లుగా మారినవారంతా నిరుద్యోగులే అయినా ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా స్టోర్లలో సామగ్రి లేదని, ఒకటి ఉంటే మరొకటి లేకపోవడంతో పనులు పూర్తి చేయలేకపోతున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు కాంట్రాక్టర్లు విద్యుత్ పనులు క్లియర్ చేయాలంటే ఎల్సీ పెద్ద సమస్యగా మారిందని, దీనిపై కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఎస్పీడీసీఎల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టర్ల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మాజీ సభ్యుడు యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలూరు మహేందర్, నామిని వెంకటేశ్, వివిధ జిల్లాలకు చెందిన ప్రతినిధులు ఎస్.నాగయ్య, రాజు మహారాజ్, వెంకట్‌రెడ్డి, అశోక్, భరత్‌రెడ్డి, మనోహర్, బాల్‌రెడ్డి, శంకర్, ఆర్.ప్రదీప్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.