Hyderabad | వెంగళరావునగర్, మార్చి 17 : పెండ్లి చేసుకోవాలా.. ఐదేండ్లు ఆగు.. అప్పుడు ఆలోచించుకుని చెప్తానని దాటవేస్తూ మోసం చేసిన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. ప్రేమించానని.. పెండ్లి చేసుకుంటానని లోబర్చుకుని వాంఛలు తీర్చుకుని వంచన చేశాడా ప్రియుడు.. మోసపోయిన యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల కథనం ప్రకారం అమీర్‌పేట్‌లోని ఓ ల్యాబ్‌లో నాలుగేళ్ళ క్రితం రిసెప్షనిస్ట్‌గా ఓ యువతి (22) పనిచేసింది. ఏపీ విశాఖపట్నానికి చెందిన శివకోటి పవన్ కుమార్ (25) అదే ల్యాబ్‌లో డెంటల్ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. ఆమెను పవన్ ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో ఆమె కూడా అంగీకరించింది. పెండ్లి చేసుకుంటానని నమ్మించి.. 2021 నవంబర్‌లో ఆమె రూమ్‌కు వచ్చి తన కామ వాంఛలు తీర్చుకునేవాడు. అలా మూడు నెలల పాటు శారీరక సంబంధాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత ఎల్లారెడ్డిగూడలోని అతని రూమ్‌కు ప్రియురాలిని తరచూ తీసుకెళ్లి తన కోర్కెల్ని తీర్చుకునేవాడు. హైటెక్ సిటీలోని ఓయో రూమ్‌కు తీసుకెళ్లేవాడు.
ఆ తర్వాత సోమాజిగూడలోని ఉమెన్స్ హాస్టల్‌కు యువతి మారింది. ఇలా ఇంకెంత కాలం.. పెండ్లి చేసుకోమ్మని ప్రియుడ్ని అడిగితే.. నీతో పెండ్లా.. నిన్ను చేసుకునేదే లేదంటూ ప్రియుడు అడ్డం తిరిగాడు. అప్పటికి గాని తాను మోసపోయానని గ్రహించకలేకపోయింది ఆ యువతి. అతని తల్లి కూడా తనతో గొడవ పడిందని వాపోయింది. పవన్ కుమార్ చెల్లి, అతని బావతో మాట్లాడి పెద్దల సమక్షంలో పంచాయితీ చేయగా.. పెండ్లి చేసుకుంటానని చెప్పిన పవన్ కుమార్.. బాండ్ పేపర్ పై మాత్రం సంతకం పెట్టేందుకు నిరాకరించాడు. ఐదేండ్లు ఆగు.. అప్పుడు ఆలోచించుకుని చెప్తానన్నాడు. ఆ తర్వాత నిన్ను పెండ్లి చేసుకునేదే లేదని తెగేసి చెప్పాడు. ప్రియురాలి ఫోన్ నెంబర్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ ను బ్లాక్ చేశాడు.
హైదరాబాద్ నుంచి మకాం మార్చి.. విశాఖపట్నంలోని డెంటెలిజెంట్ డెంటల్ సొల్యూషన్స్ లో పని చేస్తున్నట్లు అతడి స్నేహితుల ద్వారా యువతి తెలుసుకుంది. ప్రేమించి.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ప్రియుడు పవన్ కుమార్ పై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.