చార్మినార్, జనవరి 20: సహాయం చేస్తున్నట్లు నమ్మిస్తారు. ఏటీఎంల వద్దకు వచ్చే అమాయకులను టార్గెట్ చేస్తారు. వారికి తెలియకుండానే ఏటీఎం కార్డులు తస్కరించి నగదు కాజేసే ముఠాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ మండల డీసీపీ స్నేహమిశ్ర వివరాల ప్రకారం హర్యానాకు చెందిన వకీల్ అలీ (45) నగరానికి వలస వచ్చి చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి హర్యానాకే చెందిన ఇస్లాంతో పాటు యూపీకి చెందిన గుల్లూ ఫర్మాన్ (23), హైదరాబాద్‌కు చెందిన ఒబైద్ ఆరీఫ్ (30)తో పరిచయం ఏర్పడింది. విలాస జీవితానికి అలవాటు పడిన వీరంతా ఓ పథకం రచించారు. ఉదయం, సాయంత్రం ఏటీఎం కేంద్రాలకు వచ్చే వారి దృష్టి మరల్చి వారి వద్ద నుంచి నగదు తస్కరించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో నగదు తీసుకునేందుకు వచ్చే వారికి సహాయం చేస్తున్నట్లు నటించేవారు. అమాయకులను మాటల్లో పెట్టి ఏటీఎం కార్డు, పిన్ నంబర్లను సేకరించేవారు. వీటి ఆధారంగా మరో ప్రాంతానికి వెళ్లి నగదు డ్రా చేసుకొని వాటాలు పంచుకునేవారు. గత నెల బహదూర్‌పురకు చెందిన అతియా ఖాన్ ఏటీఎంకు రాగా ఆమెను నమ్మించిన ముఠా సభ్యులు చాకచక్యంగా ఏటీఎం కార్డును తస్కరించారు. పిన్ నంబర్ తెలుసుకొని నకిలీ కార్డును ఆమె చేతిలో పెట్టి అక్కడ నుంచి పారిపోయారు. అతియా ఖాన్ నుంచి తస్కరించిన కార్డు ద్వారా దశలవారీగా రూ.2 లక్షల మూడు వేల నగదును డ్రా చేయగా ఆమె బహదూర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అనుమానితులైన వకిల్ అలీ, ఫర్మాన్, ఒబైద్అలీని సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి విచారించారని డీసీపీ సేహ మిశ్ర తెలిపారు. మరో ఇద్దరు నిందితులైన గుల్లూ, ఇస్లాం పరారీలో ఉన్నారని వెల్లడించారు. వీరిపై తెలంగాణలో 10 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 2, ఒడిస్సాలో 4, కర్నాటకలో 2 కేసులు నమోదైనట్లు డీసీపీ స్నేహమిశ్ర తెలిపారు. నిందితుల నుంచి రూ.7. 50లక్షలు, వివిధ బ్యాంకులకు చెందిన 105 కార్డులు, ద్విచక్ర వాహనం, కారు, నకిలీ పోలీస్ ఐడీ కార్డు, 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్, ఫలక్‌నుమా డివిజన్ ఏసీపీ జావెద్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.