Hyderabad | బంజారాహిల్స్, జూలై 6 : మాజీ ప్రియురాలిని వెంబడిస్తూ ప్రేమించకపోతే సోషల్‌మీడియాలో ఫోటోలు పెడ్తానంటూ బెదిరిస్తున్న యువకుడిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన మల్లుగల్ల వరప్రసాద్(23) అనే వ్యక్తి ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. ఫిలింనగర్ పీఎస్ పరిధిలోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో యువతి(22)తో సోషల్‌మీడియా ద్వారా పరిచయం అయింది. కాగా కొన్నాళ్ల తర్వాత వరప్రసాద్ ప్రవర్తన సరిగాలేకపోవడంతో యువతి బ్రేకప్ చెప్పింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన యువతి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. కాగా ఇటీవల ఆమెను వెంబడిస్తూ వేధింపులకు గురిచేస్తుండడంతో పాటు తనతో సన్నిహితంగా ఉండకపోతే ప్రైవేటు ఫోటోలు బయటపెడ్తానంటూ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా యువతి తండ్రికి ఫోటోలు పంపించాడు. దీంతో తన కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్న వరప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.