మైలార్దేవ్పల్లి, డిసెంబర్ 29: ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి చేయగా ముఖంపై తీవ్ర గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానికుల కథనం ప్రకారం..అత్తాపూర్లోని వాసుదేవరెడ్డినగర్ కాలనీలో గోపాల్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కూతురు నిత్యశ్రీ ఆదివారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్క ఒక్కసారిగా చిన్నారిపై పడి దాడి చేసింది. ముఖం, చేతులను పీకింది. స్థానికులు గమనించి వెంటనే కుక్కను తరిమి వేశారు. అప్పటికే ఆ చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలిపోయింది.
వెంటనే కుటుంబ సభ్యులు నిత్యశ్రీని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ప్రభుత్వ ఆసపత్రికి తరలించడంతో డాక్టర్లు చికిత్స చేసి 30 కుట్లు వేశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాసుదేవరెడ్డినగర్ కాలనీలో కుక్కల బెడద అధికంగా ఉందని ఫిర్యాదు చేస్తున్న అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు.