సిటీబ్యూరో: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ అనే అంశంపై నగరవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిశారంటే అదే చర్చ… సోషల్‌మీడియా వేదికలపైనా అదే టాపిక్. ఒకరు కాల్పుల విరమణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. మరికొందరు సమర్థిస్తున్నారు. మరికొందరు 1971 నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఇందిరాగాంధీ ప్రస్తావన తెస్తున్నారు.
ఉగ్రవాదులను తయారు చేసే ఫ్యాక్టరీగా మారిన పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ ఫండింగ్ ఇవ్వడంపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ నడ్డివిరిచే అవకాశం వచ్చిందని.. అది జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో కాల్పుల విరమణ ప్రకటన వచ్చిందంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సోషల్‌మీడియాలోనూ కాల్పుల విరమణ టాపిక్కే. వాకింగ్ గ్రౌండ్స్, హోటల్స్, మార్కెట్లు, ఫంక్షన్ల వద్ద కూడా ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు.