బంజారాహిల్స్, ఏప్రిల్ 15: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్ని ఖాళీగా ఉన్నాయని, వాటిని ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా నుంచి సుమారు 20 ఏండ్ల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని వెంకటగిరిలో నివాసం ఉంటున్న సంకర్షన్ దాస్ ప్లంబర్‌గా పనిచేస్తుంటాడు. గతంలో బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పనిచేస్తున్న సమయంలో అక్కడ ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన ఎ.నాగరాజురెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
తనకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో పనిచేస్తున్న ప్రదీప్‌రెడ్డి అనే వ్యక్తి తెలుసని, అతడికి ఉన్న పరిచయాలతో రాజేంద్రనగర్, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఖాళీగా ఉన్న వాటిని అలాట్ చేయిస్తానని నమ్మించాడు. ఒక్కో ఇంటికి రూ.4లక్షలు ఖర్చవుతుందని, అడ్వాన్స్‌గా రూ.2లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పాడు. దీంతో గత ఏడాది ఏప్రిల్‌లో రూ.1.5 లక్షలు చెల్లించిన సంకర్షన్ దాస్ తనతో పాటు పనిచేస్తున్న మరో పది మందికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పించాలని కోరాడు. దీంతో వారందరికీ ఇండ్లు ఇప్పిస్తానంటూ ప్రదీప్‌రెడ్డిని పరిచయం చేశాడు.
గత ఏడాది సెప్టెంబర్‌లో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేసిన నాగరాజురెడ్డి, ప్రదీప్‌రెడ్డి కొన్ని నెలల తర్వాత వారికి పట్టాలు ఇచ్చాడు. రాజేంద్రనగర్, మల్కాజిగిరి మండలాల పరిధిలో ఇండ్లు వచ్చాయంటూ ఆనందంతో ఇటీవల ఆయా ప్రాంతాలకు వెళ్లి చూడగా.. వారికి ఇచ్చిన పట్టాలు బోగస్ అని తేలింది. రాజేంద్రనగర్, మల్కాజిగిరి ఆర్డీవోల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన బాధితులు అక్కడి అధికారులను సంపద్రించగా.. తాము ఎలాంటి పట్టాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. దీంతో మంగళవారం పలువురు బాధితులు సీపీఎం జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యదర్శి సాయి శేషగిరిరావుతో కలిసి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులు నాగరాజురెడ్డి, ప్రదీప్‌రెడ్డి తమ వద్ద నుంచి సుమారు రూ.20లక్షలు వసూలు చేశారని, తమతో పాటు పెద్దసంఖ్యలో బాధితులు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నేత సాయిశేషగిరిరావు మాట్లాడుతూ.. ప్రతి బస్తీలో డబుల్బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయని, సమగ్రమైన విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.