మైలార్‌దేవ్‌పల్లి, జూన్ 24: ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటిబావిలో పడిపోయాడు. బావిలో గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభించలేదు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బిహార్ రాష్ర్టానికి చెందిన చంద్రకుమార్ .. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి మైలార్‌దేవ్‌పల్లి డివిజన్, లక్ష్మీగూడ రాజీవ్‌గృహకల్పలో ఉంటున్నారు.
వీరి కోడుకు ప్రిన్స్(5) మంగళవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటూ.. తోటి స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న నీటి బావి వద్దకు వెళ్లి.. బావిలో పడిపోయాడు. స్నేహితులు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు బావి వద్దకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్, మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్‌లు హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, అగ్ని మాపక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రైనా బాలుడి ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.