గ్లోబల్ కల్చరల్ అండ్ బిజినెస్ కనెక్ట్ కార్యక్రమానికి హాజరైన మంత్రి
కొండాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో విద్యా, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని టీ -హబ్‌లో అమెరికన్ తెలంగాణ సోసైటీ, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ కల్చరల్ అండ్ బిజినెస్ కనెక్ట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకరరావు మాట్లాడుతూ తెలంగాణ సర్కారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా, వైద్యాన్ని మెరుగు పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. కళలు, కళారంగాల అభివృద్ధికి ప్రత్యేకచర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతఉందన్నారు.
పాశ్చత్య సంస్కృతి వైపు నేటి పిల్లలు ఆసక్తి చూపుతున్నారని, వారి దృష్టిని మన కళల వైపు మళ్ళించాలన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత పద్మజా రెడ్డి వంటి కళాకారులు భవిష్యత్తులో కళారంగానికి మరిన్ని సేవలందించాలన్నారు. విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు స్వరాష్ట్ర, సొంత గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు.
రూ. 8 వేల కోట్ల రూపాయాలతో రాష్ట్రాంలోని పాఠశాలల అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తే వారి పేర్లను పెట్టనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు.
వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ, దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ నృత్యకారిణి పద్మజా రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు, ఎంఎల్సీ గోరేటి వెంకన్న, ఏటీఎస్, టీటా ప్రతినిధులు కరుణాకర్ మాధవ్, నరేందర్‌రెడ్డి, వెంకట్ మంతెన, రాంచెందర్రెడ్డి, సందీప్ మక్తాల తదితరులు పాల్గొన్నారు.


