సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ‘మా పిల్లలకు ఎంత చెప్పినా వినడం లేదు. చదువుకోవాలని చెబితే శ్రద్ధ పెట్టడం లేదు. స్మార్ట్ ఫోన్లతోనే కాలం గడుపుతున్నారు. వాళ్ల టీచర్లకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు.’ ఇది చాలా మంది తల్లిదండ్రులు తమకు తెలిసిన వాళ్ల దగ్గర ఆందోళన చెందుతుంటారు. ఎంతసేపు వారికి ర్యాంకులు రావాలి అనే ఆలోచనలే చేస్తుంటారు. అయితే పిల్లలను కేవలం మార్కుల కోణంలో చూడకూడదని వారిలో మార్పులు తేవాలంటే ముందుగా తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలను మార్చుకోవాలని సైకాలజిస్టులు చెబుతున్నారు.
స్కూల్లల్లో పిల్లలపై ఒకరకమైన ఒత్తిడి ఉంది. కిలోల బరువు మోసుకుంటూ స్కూల్‌కు వెళ్లి.. అనేక ప్రాజెక్టు వర్క్‌లు, పరీక్షలు అంటూ తీరికలేకుండా గడుపుతుంటారు. ఇంటికొచ్చేసరికి పూర్తిగా అలిసిపోతారు. ఆట్లాంటి చిన్నారులతో మళ్లీ చదువు..చదువు అంటూ వెంబడించి వారి మనసును గాయపర్చకుండా అర్థం చేసుకుని నడుచుకోవాలని సూచిస్తున్నారు. చిన్న చిట్కాలు పాటిస్తే చిన్నారులు దారికొస్తారంటూ నిపుణులు వివరిస్తున్నారు.
ఫోన్ వద్దు.. మైదానమే ముద్దు
పిల్లలున్న ప్రతి ఇంట్లో స్మార్ట్ఫోన్ల ఇబ్బందులు ఉంటున్నాయి. రోజంతా ఆ డివైజెస్పైనే గడుపుతున్నారు. వారి ఆరోగ్యానికి హాని అని తెలిసినా.. పేరెంట్స్ చెప్పినా..ఏమాత్రం పట్టించుకోకుండా మొబైల్స్‌లోనే ఉంటున్నారు. అది చాలా ప్రమాదకరం. స్కూల్ నుంచి వచ్చింది మొదలు ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోతున్నారు. మానసికంగా వారిపై వీటి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ అలవాటును తక్షణమే మాన్పించాలి. అందుకోసం కొంత సమయం పార్కుకు, క్రీడా ప్రాంగణానికో తీసుకెళ్లాలి. అ క్కడ శారీరక ఆటలల్లో పాల్గొనేలా చే యాలి. ముఖ్యంగా పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి.
-శైలజ, సైకాలజిస్టు
ఒత్తిడితో బాల్యం చిత్తు
పిల్లలను కొట్టడం చాలా ప్రమాదం. అది వారి లేత మనసులను గాయపరుస్తుంది. అది కొనసాగితే వారు మొండికేస్తారు. ఏ విషయాన్నైనా వారికి అర్థం అయ్యేలా చెప్పగలగాలి. పిల్లలు ఇంటికి రాగానే కొందరు తల్లిదండ్రులు పుస్తకాలు ముందేసి పాఠాలను బట్టీ పట్టిస్తుంటారు. అప్పటి వరకు బాగానే ఉన్నా దీర్ఘకాలంలో అది పిల్లలకు అంత ఉపయోగం ఉండదనే విషయాన్ని అర్థంచేసుకోవాలి. ఈ ధోరణి మానేసి కాస్త ప్రాక్టికల్‌గా చెప్పే ప్రయత్నం చేయాలి.
-స్నేహ, సైకాలజిస్టు
ఎట్టి పరిస్థితుల్లో చేయి చేసుకోవద్దు
టైంటేబుల్ ప్రకారం పిల్లలు నడుచుకునేలా మోటివేట్ చెయ్యాలి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చే సరికి పూర్తిగా అలిసిపోతారు. ఇదంతా గుర్తించని తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేందుకు నానా కష్టాలు పడుతుంటారు. కొందరైతే ఏకంగా చేయి చేసుకొంటున్నారు. కొట్టడం అనేది వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పని ఏదైనా కానివ్వండి..ఎప్పుడు హోం వర్క్ చేసుకోవాలి. టీవీ ఎప్పుడు చూడాలి. ఎంత సేపు ఆడుకోవాలి? ఎన్ని గంటలకు పడుకోవాలి? ఇలా అన్ని అందులో ఉండాలి. ఇది మంచి ఫలితాన్నిస్తుంది.
-కవిత పాన్యం, సైకాలజిస్టు
మంచి పని చిన్నదైనా మెచ్చుకోవాలి
చుట్టూ ఉన్న పరిసరాలు ప్రశాంతంగా లేకపోతే ఎవరు కూడా శ్రద్ధ పెట్టడం సాధ్యం కాదు. పిల్లలు చదువుకునే చోట ఆహ్లాదకరంగా ఉండాలి. ఎలక్ట్రానిక్ పరికరాల శబ్ధాలు ఉండకూడదు. ఇలాంటి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఎవరైనా మంచి పనిచేస్తే ప్రోత్సహిస్తుంటాం. పిల్లల విషయంలోనూ అలాగే వ్యవహరించాలి. మంచి పని చిన్నదైనా అభినందించి ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. వాళ్లకిష్టమైన ప్రదేశానికి లేదా సినిమాకు తీసుకెళ్లాలి. ఇలా చేస్తే మరింత ఉత్సాహంతో అడుగులు పడుతాయి.
-మోత్కూరి రామచంద్రం, సైకాలజిస్టు
ఆహారంతోనే ఆరోగ్యం
పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్లు చదువులో రాణించగలరని పేరెంట్స్ తెలుసుకోవాలి. శారీరకంగా, మానసికింగా ఉల్లాసంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. అప్పుడు మంచి ఫలితాలుంటాయి.
-సనా ఫాతిమా, పోషకాహార నిపుణులు