ఖైరతాబాద్, డిసెంబర్ 24 : పంజాగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థి చనిపోయాడు. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెంలోని మధురా బస్తీకి చెందిన అర్షద్ అహ్మద్ కుమారుడు అయాన్ అహ్మద్(23) హైదరాబాద్‌లో తన స్నేహితులతో ఉంటూ నల్ల నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఖాళీ సమయాల్లో రాపిడో బైక్ రైడర్‌గా పనిచేస్తున్నాడు.
సోమవారం రాత్రి ప్రశ్నాపత్రాలు తీసుకొచ్చేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా, పంజాగుట్ట మోడల్ హౌస్ సమీపంలో అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం అయాన్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయాన్ అక్కడికక్కడే మృతిచెందగా, డీసీఎం వాహనం డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ ఖమ్మం జిల్లాకు చెందిన అరువపల్లి మహేశ్‌గా గుర్తించి కేసు నమోదు చేశారు.