హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): బీటెక్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించిన టీఎస్‌ఈసెట్‌లో 90.69 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో శుక్రవారం నాడు విడుదల చేశారు. 22,001 విద్యార్థులు ఈసెట్‌కు హాజరుకాగా, 19,954 మంది అర్హత సాధించారు.
బీటెక్ మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లను సైతం ఈసెట్ ద్వారా భర్తీ చేయనుండటంతో ఈసెట్ పరీక్షలో అర్హత సాధించిన వారందరికీ సీట్లు లభించే అవకాశమున్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కార్యదర్శి ఎన్ శ్రీనివాస్‌రావు, జేఎన్టీయూహెచ్ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి, కో కన్వీనర్ ప్రొఫెసర్ రాంజీ తదితరులు పాల్గొన్నారు.
44 ఏండ్ల వయసులో ఈ తరం విద్యార్థుల తో పోటీపడి ఈసెట్‌లో ఐదో ర్యాంకు సాధించి ఔరా అనిపించారు మల్కాజిగిరికి చెందిన ఎన్వీ శాంతిస్వరూప్. పలువురికి ఆదర్శంగా నిలిచిన ఆయన ప్రతిభకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు. గణితం విభాగంలో 71 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సొంతం చేసుకొన్న ఆయన, బీటెక్ రెండో సంవత్సరంలో చేరనున్నారు.
ఎంఎన్సీ కంపెనీల్లో బీటెక్ వారినే ఉద్యోగాల్లో నియమించుకుంటుండటంతో తాను సైతం బీటెక్ చేసేందుకు సిద్ధపడ్డానని శాంతిస్వరూప్ ‘నమస్తే తెలంగాణ’ చెప్పారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సులో జేఎన్టీయూలో చేరతానని ఆయన వెల్లడించారు.