సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్న ఆబ్కారీ ఎస్టీఎఫ్ అధికారులు గురువారం నగరంలోని పలు చోట్ల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 9 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.13లక్షల విలువ చేసే 21కిలోల గంజాయి, 360 కిలోల నల్లబెల్లం,50కిలోల ఆలంతో పాటు ఆటో, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆబ్కారీ ఈడీ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం… జార్ఖాండ్‌కు చెందిన అన్సారీ అనే వ్యక్తి ఒరిస్సా నుంచి 11.6 కిలోల గంజాయిని కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. అయితే లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు దిగిన అన్సారీ గంజాయిని మరో వ్యక్తికి విక్రయించేందుకు స్టేషన్ సమీపంలో ఎదురుచూస్తుండగా, అప్పటికే సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 11.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును శేరీలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ , జమీర్ ఖాన్, మహ్మద్ సహేద్, షేక్ యాసిన్, ఫాజిల్‌లు డీఆర్‌డీఒ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.2కిలోల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, ద్విచక్రవాహనంను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టీఎఫ్ ఈఎస్ అంజి రెడ్డి తెలిపారు.
మధ్యప్రదేష్కు చెందిన వివేక్ దాహెరియా గంజాయి సరఫరా చేస్తాడు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ నుంచి తీసుకువచ్చిన గంజాయిని ఎంజీబీఎస్ బస్టేషన్ సమీపంలో మరో వ్యక్తికి ఇచ్చేందుకు నిరీక్షించగా సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మహార్రాష్టకు చెందిన మణికంఠ బాలనగర్ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 2.233 కిలోల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గుడంబా తయ్యారీకి వినియోగించే నల్లబెల్లం, ఆలంను తరలిస్తున్న ఒక వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. విజయ్ అనే వ్యక్తి నగరం నుంచి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి ఆటోలో నల్లబెల్లం, ఆలం తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు ఎల్బీనగర్ వద్ద ఆటోను తనిఖీ చేయగా 360 కిలోల నల్ల బెల్లం, 50 కిలోల అలం బయటపడింది. నిందితుడు విజయ్ను అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 360 కిలోల నల్లబెల్లం, 50 కిలోల అలంను స్వాధీనం చేసుకున్నారు.