సిటీబ్యూరో, ఆగస్ట్ 15 (నమస్తే తెలంగాణ):హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో పేట్ల బురుజులోని సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం 80వ భారత స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించారు. దేశంకోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్రసమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఘననివాళులు అర్పించారు.
అనంతరం విధినిర్వహణలో అంకితభావం, విశేష ప్రతిభ కనబరిచిన 72మంది పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీ ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ ఆర్ వెంకటేశ్వర్లు, చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే, టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, అదనపు డీసీపీ బీ కిష్టయ్యలు పాల్గొన్నారు.
చెరువులు, నాలాలు, పార్కులు కాపాడి పర్యావరణ పరిరక్షణకు రాజ్యాంగస్ఫూర్తితో కలిసి పనిచేద్దామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవవేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకావిష్కరణ చేశారు.