Drugs | శేరిలింగంపల్లి, డిసెంబర్ 30: గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 8 మందికి డ్రగ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధి కొండాపూర్‌లో ఆదివారం రాత్రి క్వాక్ పబ్‌లో టీన్యాబ్, ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది నుంచి పోలీసులు డ్రగ్స్ నిర్ధారణ నమూనాలు సేకరించారు. మూత్ర శాంపిల్స్‌లో నలుగురికి, సేలైవా శాంపిల్స్‌లో మరో నలుగురికి మొత్తం 8 మందికి ఈ తనిఖీల్లో పాజిటివ్ నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు.
కొండాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్వాక్ పబ్‌లో ఆదివారం రాత్రి బెన్ భూమర్ భ్లూమ్ లైవ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు వచ్చిన వారికి డ్రగ్ తనిఖీలు చేపట్టగా.. పాజిటివ్ నిర్ధారణ అయిందని, పబ్‌లో ఎలాంటి డ్రగ్స్ లభించలేదని పోలీసులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన 8 మందిలో నలుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ 27 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని టీన్యాబ్, ఎస్వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న దాడుల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.