సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఎంకంబరెన్స్ సర్టిఫికెట్ పొందలేని కొన్ని పాత ఆస్తులపై నకిలీ పత్రాలు సృష్టించి రుణాలిచ్చే బ్యాంకునే 8.5 కోట్లు మోసం చేసిన ఇద్దరు ఏజెంట్లపై సీసీఎస్‌లో కేసు నమోదయ్యింది. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ రోడ్డులో ఉన్న కాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ అనే సంస్థ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ). ఈ సంస్థ వివిధ రకాలైన ఆస్తులను తనఖా పెట్టుకొని రుణాలు మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా ఈ సంస్థకు పనిచేస్తున్న ఇద్దరు ఏజెంట్లు వేణు, శ్రీనివాస్‌లు ఒక పథకం ప్రకారం రుణాలు తీసుకోవడానికి పన్నాగం పన్నారు. 1983 కంటే ముందు జరిగిన భూ లావాదేవీలు ఈసీ(ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్)లో కనిపించవు. దీనిని ఆసరాగా చేసుకొని ఘట్కేసర్, ఎస్ఆర్నగర్ బ్రాంచ్‌లలో ఈ ఏజెంట్లు 36 మంది పేర్లపై రుణాలు తీసుకున్నారు. సదరు ఆస్తులకు సంబంధించిన అసలైన డాక్యుమెంట్లను తీసుకొని వాటిపై జీపీఏ చేయించి, అందుకు సంబంధించిన నకిలీ లింక్ డాక్యుమెంట్లు సృష్టించి పథకం ప్రకారం రుణాలు తీసుకున్నారు. 2022 నుంచి 2023 మధ్య ఈ రుణాలు పొందారు.
తక్కువ విలువ ఉన్న ఆస్తులకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి వాటి విలువలు ఎక్కువగా చూపించి రుణాలు పొందారు. దీనిపై అనుమానం వచ్చి బ్యాంకులో అంతర్గత విచారణ జరపగా ఈ మోసం బహిర్గతమైంది. ఏజెంట్లు నకిలీ పత్రాలతో రుణాలు పొంది బ్యాంకుకు భారీ నష్టం చేసినట్లు విచారణలో బయటపడింది. తానొక్కడినే నకిలీ పత్రాల ఆధారంగా 15 రుణాలను పొందానని విచారణలో ఏజెంట్ శ్రీనివాస్ ఒప్పుకున్నాడు. ఈ మేరకు బ్యాంకు సీనియర్ మేనేజర్ రాకేశ్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.