కీసర, నవంబర్ 30: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్‌ను మించి విద్యా బోధనతో పాటు సకల వసతులను కల్పించారు. గతంలో ప్రైవేట్ పాఠశాలలకు పంపించిన తల్లిదండ్రులు ప్రత్యేక చొరవతో ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో వారివారి పిల్లలను చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏకంగా ప్రైవేట్ పాఠశాలకు వెళుతున్న విద్యార్థులను మానిపించి ప్రభుత్వ పాఠశాల్లో చేర్పిస్తున్నారు. మండలంలో మొత్తం 35 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
2022-23 సంవత్సరానికి గాను అన్ని పాఠశాలలకు కలిపి మొత్తం 750 మంది కొత్త విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. నర్సంపల్లిలో 2, యాద్గార్‌పల్లిలో 27, కీసరగుట్టలో 2, వన్నీగూడలో 1, కీసరలో 47, అంకిరెడ్డిపల్లిలో 19,కీసరదాయరలో 2, కుందన్‌పల్లిలో 9, చీర్యాల్‌లో 88, తిమ్మాయిపల్లిలో 12, గోధుమకుంటలో 10, భోగారంలో 29, నాగారంలో 142, దమ్మాయిగూడలో 91, అహ్మద్‌గూడలో 34, రాంపల్లిలో 120, రాంపల్లిదాయరలో 20, కరీంగూడలో 10 చొప్పున మొత్తం 750 కొత్త అడ్మిషన్లు జరిగాయి. ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఉచితంగా నోటు పుస్తకాల పంపిణీ, బట్టలు, షూస్ అందిస్తున్నారు. దానికి తోడు నాణ్యతమైన విద్య లభిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పడింది.
ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన విశ్వాసం
ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు విశ్వాసం పెరిగింది. చాలా మంది తల్లిదండ్రులు వారివారి పిల్లలను ప్రభుత్వ బడుల్లోచేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్ మీడియం ఉండడంతో ఉన్నత బోధన ప్రమాణాలు, వసతులు ఉన్నట్లుగా గుర్తించి ప్రధానంగా కీసర, గోధుమకుంట, చీర్యాల్, తిమ్మాయిపల్లి, యాద్గార్పల్లి, నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లిదాయర, రాంపల్లి ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రైవేటుకు దీటుగా విద్యను అందిస్తున్నాం
కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాల్లో అన్ని వసతులు ఉన్నాయి. విద్య కూడా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అందిస్తున్నాం. ప్రైవేట్ పాఠశాల్లో ఫీజుల భారాన్ని తల్లిదండ్రులు మోయలేకపోతున్నారు. అదే సమయంలో అన్ని పాఠశాల్లో ఇంగ్లిష్ మీడియం ఉండడంతో సర్కారు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందకు తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.
– శశిధర్,ఎంఈవో