Khairatabad Ganesh | ఖైరతాబాద్, ఆగస్టు 2 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. కోట్లాది మంది భక్తులకు కొంగుబంగారంగా నిలిచి ప్రతి ఏడాది భిన్నమైన రూపాలతో కనిపించే ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రస్థానంలో 1954 సంవత్సరంలో ఒక్క అడుగుతో మొదలై.. నేడు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు.
ఏడు పడగల ఆదిశేషుడి నీడలో సప్తముఖాలతో ఖైరతాబాద్ మహాగణపతి కనిపిస్తారు. కుడివైపు ముఖాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఎడమవైపు ముఖాల్లో సరస్వతి, లక్ష్మి, పార్వతి అమ్మవార్లు ఉంటారు. అలాగే రెండు వైపులా సప్తహస్తాలతో విభిన్నమైన ఆయుధాలను ధరించి స్వామి వారు దర్శనమిస్తారు. కుడివైపు చక్రం, పాశం, త్రిశూలం, పద్మం, శంఖం, అభయహస్తం, ఎడమ వైపు రుద్రాక్షమాల, పాశం, గ్రంథం, వీణ, కమలం, గధ, మరో చేతిలో (మొదక హస్తం) ప్రసాదాన్ని పట్టుకొని ఉంటారు. స్వామి వారి కుడివైపు అయోధ్య బాలరాముడు, ఎడమవైపు రాహు, కేతుల విగ్రహాలు, స్వామి వారి వాహనం మూషికం ఉంటాయి. వీటితో పాటు ఉప మండపాల్లో శ్రీ శ్రీనివాసుడు, లక్ష్మి కల్యాణంలో క్షీరసాగర మథనం, శ్రీ పార్వతీపరమేశ్వరుల కల్యాణంలో బ్రహ్మ, విష్ణు, నారద మహర్షిని వీక్షించవచ్చు.
స్వామి వారి విగ్రహం 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో దర్శనమిస్తారు. వీటితో పాటు కుడివైపు పది అడుగుల అయోధ్య బాలరాముడి విగ్రహం, ఎడమ వైపు తొమ్మిది అడుగుల ఎత్తులో రాహు, కేతుల విగ్రహాలు, మూడు అడుగుల మూషికాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. కుడి వైపు 15 అడుగుల మండపంలో తొమ్మిది అడుగుల ఎత్తులో లక్ష్మి, శ్రీనివాసుడి విగ్రహాలు, ఎడమవైపు మండపంలో అంతే ఎత్తులో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.
బ్రహ్మణి, చాముండా, మహేశ్వరి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, వైష్ణవి సప్తమాత్రుకలు. పురాణేతిహాసాల ప్రకారం ఆ సప్తమాత్రుకలు ఉద్భవించడానికి శ్రీ మహా గణపతి మూల కారణంగా చెబుతారు. అంతేకాకుండా కాలమానంలో ఏడు రోజులు, ఈ సంవత్సరం వినాయక చవితి ఏడో శనివారం, ఏడో తేదీ (సెప్టెంబర్ 7)న ఉండటంతో పాటు ఏడు పగడలతో అదిశేషుడి నీడలో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా (ప్రధాన విగ్రహంతో కలిపి) ఏడు ముఖాలతో ప్రతిష్ఠిస్తుండటం ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. ప్రజలు, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని, పాలకులు మంచి పాలన అందించేందుకు సప్తమాత్రుకలు శక్తిని ప్రసాదించాలన్న సంకల్పంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.
అలాగే స్వామి వారికి ఒక వైపు ఉండే రాహు, కేతులు విగ్రహాలను దర్శించుకుంటే సకల దోషాలు, అరిష్టాలు తొలగిపోతాయని, మరో వైపు బాలరాముడి విగ్రహం రామరాజ్యానికి ప్రతీకగా ఉంటుందని దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విట్టల శర్మ తెలిపారు. అలాగే ప్రస్తుత తరుణంలో యువతీ యువకులకు వివాహం జరుగడం లేదని, దేశ వ్యాప్తంగా బ్రహ్మచారిణులు, బ్రహ్మచారుల సంఖ్య పెరిగిపోయిందని, తల్లిదండ్రులు బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో ఉప మండపాల్లోని శ్రీ శ్రీనివాసుడు, పార్వతీ పరమేశ్వరుల కల్యాణాలను దర్శించుకుంటే లోకకల్యాణంతో పాటు పెండ్లి కాని వారికి వివాహాలు జరుగుతాయన్నారు.