మేడ్చల్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ)/బోడుప్పల్/ పీర్జాదిగూడ/జవహర్‌నగర్ : తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ముఖాల్లో చిరునవ్వే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని.. ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు.
డంపింగ్ యార్డుతో ఇబ్బందులు లేకుండా చర్యలు ..
జవహర్‌నగర్ సమీపంలోని డంపింగ్ యార్డుతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి చర్యలు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. యార్డు నుంచి దుర్వాసన రాకుండా రూ.147 కోట్లతో గ్రీన్ క్యాపింగ్ చేశామన్నారు. డంపింగ్ యార్డు సమీపంలోని 8 చెరువులను శుద్ధి చేసేందుకు రూ.250 కోట్లు మంజూరు చేశామన్నారు. దక్షిణ భారత దేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి నగరం నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తతో కరెంట్ తయారు చేస్తున్నామని.. రూ.535 కోట్లతో మరో 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులను త్వరలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే తడి, పొడి చెత్త ద్వారా ఎరువులను తయారు చేస్తున్నామని అన్నారు.
58, 59 జీవో అమలుకు చర్యలు..
జవహర్‌నగర్‌లో 58, 59 జీవో అమలు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నెల రోజుల్లో నిరుపేదలకు పట్టాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ దవాఖానను 100 పడకలకు పెంచుతామన్నారు.
ఒక్క రూపాయికే 50 వేల నల్లా కనెక్షన్లు..
మేడ్చల్ నియోజకవర్గంలో ఒక్క రూపాయికే 50 వేల నల్లా కనెక్షన్లు అందించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని.. మూడు దశల్లో అమలు చేసే ఈ పథకానికి రూ.240 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఔటర్ లోపల, బయట మంచినీరు అందించేందుకు మొదటి దశలో 12 వందల కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
మేడ్చల్ నియోజకవర్గానికి వాచ్‌మన్‌గా ఉంటా: మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు వాచ్‌మన్‌లాగా పని చేస్తానని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తానని వివరించారు. జవహర్‌నగర్‌లో నివసిస్తున్న ఇతర రాష్ర్టాల ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు.
త్వరలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రతినిధులతో సమావేశం..
మేడ్చల్-మల్కాజిగిరిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ప్రజాప్రతినిధులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరింతగా అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసే బాధ్యతను తీసుకుంటానని స్పష్టం చేశారు.
శాశ్వత వరద నీటి సమస్యకు పరిష్కారం..
బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లలో శాశ్వత వరద నీటి సమస్య పరిష్కారానికి రూ.110 కోట్లతో వరద కాలువలను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ వివరించారు. పర్వతాపూర్, ప్రతాపసింగారం రోడ్డుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా పీర్జాదిగూడలో వైకుంఠధామం నిర్మించిన మేయర్ జక్క వెంకట్‌రెడ్డిని మంత్రి అభినందించారు. డంపింగ్ యార్డులను పార్కులుగా తీర్చిదిద్ది.. మానవ వ్యర్థాలతో ఎరువుల తయారు చేస్తున్న పీర్జాదిగూడ కార్పొరేషన్‌ను జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.