సిటీబ్యూరో, మే11,(నమస్తే తెలంగాణ): ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు నివాళిగా ప్రపంచ వ్యాప్తంగా మే 12 న ‘ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు. ఈ ఏడాది ‘అవర్ నర్సెస్.. అవర్ ఫ్యూచర్..కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంతెన్స్ ఎకనామిక్స్’ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రమాణాల ప్రకారం ఐసీయూలో 1:1 నిష్పత్తి ప్రకారం ఒక రోగికి ఒక నర్సు, హైరిస్క్ పడకల వద్ద 1:2 నిష్పత్తి ప్రకారం ఇద్దరు రోగులకు ఒక్క నర్సు, జనరల్ వార్డులో 1:5 ప్రకారం ఒక్క నర్సు ఐదు మంది రోగులకు సేవలందించాల్సి ఉంటుంది.
5000 ఖాళీలున్నాయి..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15,500 మంది నర్సులు ఉండగా, ఇంకా సుమారు 5000 ఖాళీలు భర్తీచేయాల్సి ఉంది. ఇటీవల జరిగిన బదీలీల్లో హైదరాబాద్ జిల్లా నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు అధిక సంఖ్యలో నర్సులు బదిలీ అయ్యారు. దీంతో రాష్ట్ర రాజధానిలో ఉన్న పెద్దాసుపత్రుల్లో నర్సుల కొరతవెంటాడుతున్నది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో సకాలంలో వైద్యం అందించేందుకు నర్సులు ఇబ్బంది పడుతున్నారు. అధిక పనిఒత్తిడితో సతమతమవుతున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మేల్ నర్సులు 800 మంది ఉండగా, 100 మందికి పైగా మేల్ నర్సులు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారు.
రోగిని కాపాడటంలోనే ఆనందం
రోగిని కాపాడుకోవాలనే తపనతోనే బంధువులు, ఇతర సహాయకుల పట్ల కాస్త కఠినంగా ఉంటాం. రోగం నయమై సత్వరంగా కోలుకుంటే ముందుగా ఆనందించేది మేమే. సహాయకులకు ధైర్యం చెప్పడం వల్ల మా కర్తవ్యాన్ని నిర్వర్తించినవాళ్లమవుతాం. ఇంట్లో కూడా రోగుల గురించే ఆలోచిస్తుంటాం.
– సుజాత రాథోడ్, గెజిటెడ్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రెటరీ
గొప్పగా భావిస్తున్నా..
మేల్ నర్సుగా రోగికి వైద్య సేవలందించడం గొప్పగా భావిస్తున్నా. అత్యవసర పరిస్థితి సమయాల్లో సేవలందించినప్పుడు ఓ ప్రాణాన్ని కాపాడమనే సంతోషం ఉంటుంది.
– రవికిరణ్, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు