శేరిలింగంపల్లి, జూన్ 2 : మితిమీరిన వేగంతో దూసుకుపోతూ.. రహదారులపై ప్రమాదభరితంగా స్టంట్స్ చేస్తూ.. తోటి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తూ.. బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న వారిపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఐటీ కారిడార్లోని టీ హబ్ పరిసర ప్రాంతాల్లో రాత్రిళ్లు ఈ తరహా బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న 50 మంది యువకులను అదుపులోకి తీసుకొని సదరు వాహనాలను సీజ్ చేశారు. రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మాదాపూర్ టీ హబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జి పార్క్, సత్వ బిల్డింగ్, మైహోం భుజా ప్రాంతాల్లోని రహదారులపై రాత్రిళ్లు ముఖ్యంగా వారంతంలో యువకులు బైక్ రైసింగ్లకు పాల్పడుతున్నట్లు సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీల అదేశాల మేరకు శనివారం రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న 50 మంది యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 50 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని 336, 341, 184 మోటర్ వెహికల్ యాక్టు కింద కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. ఒక్కో బైక్ రూ.80,000 నుంచి దాదాపు 6 లక్షల వరకు ఖరీదు చేసే స్పోర్ట్స్ వాహనాలు ఉన్నట్లు తెలిపారు.
రహదారులపై ప్రమాదభరితంగా విన్యాసాలు చేస్తూ రేసింగ్లకు పాల్పడుతున్న వారిపై గతంలోనూ కేసులు నమోదు చేసి యువకులకు కౌన్సెలింగ్ సైతం ఇచ్చినట్లు డీసీపీ తెలిపారు. సరైన డాక్యుమెంట్లు, వాహనాలకు నంబరు ప్లేట్లు లేకుండా, రిజిస్ట్రేషన్లు లేకుండా బైక్ రేసింగ్లకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు ఈతరహా బైక్ రేసింగ్లకు పాల్పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. సమావేశంలో మాదాపూర్ అడిషన్ డీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్, రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.