సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు భద్రత కల్పించడంలో మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు నిర్వహణలో కూడా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. లోక్‌నీతి-ప్రోగ్రామ్ ఫర్ కంపారిటివ్ డెమోక్రసీ, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ తన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. నేరాల నియంత్రణ, ఛేదన, రికవరీతో పాటు నేరస్తులకు సరైన శిక్షపడేలా చర్యలు తీసుకోవడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే తమకంటూ ఒక ప్రత్యేక మార్క్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా పోలిసింగ్ నిర్వహణలో హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మినీ ఇండియాగా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో దేశ నలుమూలల నుంచి ప్రతి నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు.
వీరితో పాటు ఇక్కడున్న ప్రజలకు సంపూర్ణ భద్రత కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పోలీసింగ్ వ్యస్థను పటిష్టపరిచింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో అందరికంటే ముందు వరుసలో నిలిచిన హైదరాబాద్ పోలీసులు… చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోయేలా నగరంలో అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని సక్రమంగా నిర్వహించడంలో సిటీ పోలీసులు మొదటి స్థానంలో నిలిచినట్లు లోక్‌నీతి-ప్రోగ్రామ్ ఫర్ కంపారిటివ్ డెమోక్రసీ, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ తన నివేదికలో పేర్కొన్నది.
నగరం : సీసీ కెమెరాలు
హైదరాబాద్ : 4,40,299
ఢిల్లీ : 4,36,600
చెన్నై : 2,82,126
ఇండోర్ : 2,00,600
ముంబై : 63,598