మేడ్చల్, జనవరి 8(నమస్తే తెలంగాణ): ప్రతిరోజు 40, 000 ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. సోమవారం సచివాలయం నుంచి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, సీఎస్ శాంతికుమారి వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు. వార్డుల వారీగా దరఖాస్తుల్లో ఉన్న వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
డేటా ఎంట్రీ నమోదులో తప్పులు చేయవద్దు
ఎలాంటి తప్పులు లేకుండా ప్రజపాలన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిషేక్ అగ్యస్త అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనలో 7,24,271 దరఖాస్తులు రాగా, ఇప్పటికే 25 శాతం ఆన్లైన్ నమోదును 25 శాతం పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రోజుకు రెండు షిఫ్టుల్లో పనిచేసి ఈ నెల 17 వరకు అర్జీల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను ఈ నెల 17వ తేదీలోపు పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్తో కలిసి ఆయన బండ్లగూడ కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న డేటా ఎంట్రీని పరిశీలించారు. కాగా, రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో సర్వర్లు మోరాయించడంతో డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇబ్బందులకు గురయ్యారు.
-బండ్లగూడ, జనవరి 8