GHMC | సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో మరో నాలుగు కమిటీలను ఏర్పాటు చేస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ అండ్ రోడ్ మేనేజ్మెంట్, స్మార్ట్ పోల్ టెండరింగ్ కమిటీ, స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టుపై కమిటీలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ అండ్ రోడ్ మేనేజ్మెంట్ కమిటీలో జీహెచ్ఎంసీ (ట్రాఫిక్ అండ్ ఐటీ) అదనపు కమిషనర్ కన్వీనర్‌గా జీహెచ్ఎంసీ ఈఎన్సీ, హెచ్ఎండీఏ ఉమ్టా ఎండీ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఉన్నారు.
ట్రాఫిక్ నియంత్రణ, టీఎంసీ (ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం), పార్కింగ్ పాలసీ, జీఐఎస్ విధానం అమలుపై కమిటీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి తగిన నిర్ణయాలను అమలు చేయనున్నది. దీంతో పాటు స్మార్ట్ పోల్ టెండరింగ్ కమిటీలో జీహెచ్ఎంసీ (అడ్వైర్టెయిజ్మెంట్) అదనపు కమిషనర్ కన్వీనర్‌గా, జీహెచ్ఎంసీ ఐటీ విభాగం అదనపు కమిషనర్, ఎలక్ట్రికల్ విభాగం అదనపు కమిషనర్ ఉన్నారు.
సిటీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టు కమిటీలో జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ విభాగం అదనపు కమిషనర్ కన్వీనర్‌గా, జీహెచ్ఎంసీ ట్రాఫిక్ విభాగం అడిషనల్ కమిషనర్, ఎస్డబ్ల్యూఎం సీఈకి బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా స్ట్రీట్ వెండర్ పాలసీపై కమిటీ వేశారు. యూసీడీ విభాగం అదనపు కమిషనర్ కన్వీనర్‌గా, ఎస్టేట్ విభాగం అదనపు కమిషనర్‌గా , ఉమ్టా ఎండీ, జీహెచ్ఎంసీ సీసీపీకి కమిటీలో బాధ్యతలు అప్పగించారు.
నిలిచిన నిర్మాణ రంగ అనుమతులు
జీహెచ్ఎంసీలో నిర్మాణ రంగ అనుమతుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. టీఎస్ బీపాస్ వెబ్సైట్ సర్వర్ మెయింటెనెన్స్‌లో భాగంగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి సేవలు నిలిచిపోవడంతో దరఖాస్తుదారులు, బిల్డర్లు ఇబ్బందులుపడ్డారు. బిల్డింగ్ కమిటీ పూర్తయిన వెంటనే సేవలకు అంతరాయం ఏర్పడటంతో భవన నిర్మాణ అనుమతులు, ఓసీలు, ప్రొసిడింగ్స్ జారీ నిలిచిపోయింది.
సాయంత్రం దాటినా వెబ్సైట్ తెరుచుకోలేదు. దీంతో అధికారులు సైతం చేసేది ఏమి లేక వచ్చిన విజిటర్లకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకున్నారు. వాస్తవానికి పనివేళల్లో సర్వర్ మెయింటెనెన్స్ నిర్వహించకూడదు. కానీ టీఎస్ బీపాస్ టెక్నికల్ స్టాఫ్ దరఖాస్తుదారుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయేలా చేశారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం టీఎస్ స్థానంలో టీజీ మార్చే క్రమంలో తాత్కాలిక అంతరాయం ఏర్పడిందన్నారు.
క్షేత్రస్థాయిలో మాత్రం అధికార వర్గాల నుంచి విభిన్న వాదనలు వచ్చాయి. టెక్నికల్ ఇబ్బందులను సరిచేసే క్రమంలో సర్వర్ డౌన్ అయిందని చెప్పారు. మొత్తంగా వందలాది నిర్మాణ రంగ అనుమతులు నిలిచిపోయి బిల్డర్లు, భవన యజమానులు నిరాశ చెందారు. గురువారం నుంచి టీఎస్ బీ పాస్ వెబ్సైట్ వినియోగంలో ఉంటుందని, సేవలు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.