కవాడిగూడ, జనవరి 25 : భద్రాచల రామదాసు 390వ జయంతి ప్రయోక్త వాగ్గేయకార ఉత్సవాలు హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న శ్రీ భక్త రామదాసు విగ్రహం వద్ద జరిగాయి. ఫౌండేషన్ అధ్యక్షుడు మారగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు డాక్టర్ రమాప్రభ, సరస్వతి సంగీత శిక్షణాలయం నిర్వాహకురాలు ప్రతిమా శశిధర్, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ,
రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి జె.భవానీశంకర్, అతిధి మాస పత్రిక సంపాదకులు ఎం.వెంకటేశ్వర్ రావు, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కె.రామదాసు, కంచర్ల వెంకటరమణ, అశ్విన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. భక్త రామదాసు కీర్తనలకు బహుళ ప్రాచుర్యం కల్పించేందుకు శ్రీ హరిహర ఫౌండేషన్ కృషి చేస్తున్నదని అన్నారు. రానున్న 391వ జయంతిని పురస్కరించుకొని తిరువయూరు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలను తలపించేలా 391 మంది సంగీత కళాకారులచే భక్త రామదాసు జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం సంగీత కచేరి బృందం నవరత్న కీర్తనల గోష్టిగానాన్ని ఆలపించారు.