సిటీబ్యూరో, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): పార్కులు, రహదారులు, చెరువుల వంటి ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జా విషయంలో పలువురు స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 36 ఫిర్యాదులు అందాయని హైడ్రా సిబ్బంది తెలిపారు.
కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలోని చిన్న బంధం చెరువును ఇరువైపుల నుంచి కబ్జాలు చేసేస్తున్నారని, చెరువులోని నీళ్లన్నీ కిందకు వదిలేస్తున్నారని గాజుల రామారం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. చెరువు వాస్తవవిస్తీర్ణం ఎంతనేది నిర్ణయించి ఫెన్సింగ్ చేయాలని కోరారు. రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ విలేజ్‌లోని పీఅండ్‌టీ కాలనీలో అర ఎకరం పార్కు కబ్జాకు గురవుతున్నదని ఆ కాలనీ నివాసితులు ఫిర్యాదు చేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మాచబొల్లారంలోని ముతుకుల గుంట నీటి విస్తీర్ణం రోజురోజుకు పెరిగిపోతుందని, 4.62ఎకరాల చెరువు ప్రస్తుతం 12 ఎకరాలు ధాటిపోయిందని నివాసితులు వాపోయారు. తూములు బంద్‌చేసి, అలుగును కూడా పెంచేశారంటూ దీంతో అనుమతి పొందిన లేఔట్లు నీటమునుగుతున్నాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.