సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో నోటిఫికేషన్ జారీచేసిన 24 బార్లకు 3,520 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ కమిషనర్ హరికిరణ్ వెల్లడించారు. వీటితో పాటు ఇతర జిల్లాలోని నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. మొత్తం 28 బార్లకు 3,668 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
బార్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఈనెల 6తో ముగిసింది. దీంతో శుక్రవారం పెద్ద ఎత్తున మద్యం వ్యాపారులు బార్లకోసం దరఖాస్తు చేయడానికి ఆబ్కారీ కార్యాలయాల వద్ద బారులు తీరారు. జీహెచ్ఎంసీ మినహా ఇతర జిల్లాలైన రంగారెడ్డి, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలో నాలుగు బార్లకు 148 దరఖాస్తులు వచ్చాయి. ఒక జీహెచ్ఎంసీ పరిధిలోనే 24 బార్లకు దరఖాస్తుల ద్వారా ఆబ్కారీ శాఖకు రూ.32.68కోట్ల ఆదాయం సమకూరగా, మొత్తం 28 బార్లకు రూ.36.68 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. ఈనెల 13న బార్లకు సంబంధించిన లక్కీడ్రా తీయనున్నట్లు కమిషనర్ తెలిపారు.