మేడ్చల్, మార్చి 16(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో మరో 3 మున్సిపాలిటీల ఏర్పాటు దాదాపుగా ఖారారు చేసేలా సర్కార్ చర్యలు చేపట్టింది. జిల్లాలో మూడుచింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేటలను మున్సిపాలిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
బిల్లు ఆమోదం పొందితే మేడ్చల్ పూర్తిగా అర్బన్ జిల్లాగా మారుతుంది. జిల్లాలో ఉన్న 34 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల పరిధిలోకి మారుస్తున్న నేపథ్యంలో పంచాయతీల కార్యదర్శుల నుంచి జిల్లా అధికారులు బదిలీలపై అప్షన్లు కోరుతున్నారు. గ్రామ పంచాయతీల గ్రామ కార్యదర్శులుగా కొనసాగుతారా లేక మున్సిపాలిటీల్లో ఉంటారా గ్రామ పంచాయతీ గ్రామ కార్యదర్శులుగా కొనసాగాలంటే ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్తారా అన్న విషయమై అప్షన్లకు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలో మరో 3 మూడు మున్సిపాలిటీలు ఖాయమైనట్లే.
ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో మూడు మేడ్చల్, మూడుచింతలపల్లి, శామీర్‌పేట మండలాలు ఉండగా, ఇందులో 34 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎల్లంపేట, శ్రీరంగవరం, బండమాదారం, నూతన్‌కల్, మైసిరెడ్డిపల్లి, కొనాయిపల్లి, సోమారం, రావల్కల్, కండ్లకోయ, రాజబోల్లారం, ఘనాపూర్, గోసాయిగూడ అలియాబాద్ మున్సిపాలిటీలో అలియాబాద్, తుర్కపల్లి, లాల్‌గడి మలక్‌పేట, మజీద్‌పూర్, మురారిపల్లి, యాడారం, పొన్నాల మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో మూడుచింతలపల్లి మండలంలోని లింగాపూర్, ఉద్దమర్రి, కేశవరం, నాగిశేట్టిపల్లి, కోల్తూర్, నారాయణపూర్, పోతారం, అనంతరం, లక్ష్మాపూర్, అద్రాస్పల్లి, జగ్గంగూడ, కేశవాపూర్ గ్రామాలను విలీనం చేయనున్నారు.
జిల్లాలో 61 గ్రామపంచాయతీలు, 5 గ్రామీణ మండలాలు ఉండేవి. వీటిలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట ఉన్న 28 గ్రామాలను గతేడాది సెప్టెంబర్‌లో సమీపంలో ఉన్న 7 మున్సిపాలిటీల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో మిగిలిన 34 గ్రామ పంచాయతీలు మాత్రమే మిగలడంతో మరో 3 మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం మిగిలిన 34 గ్రామాలను విలీనం చేయాలని అధికారులు ప్రభుత్వానికి లేఖను సమర్పించారు. జిల్లా పూర్తిగా అర్బన్ ప్రాంతంగా మారనున్న నేపథ్యంలో జడ్పీ వ్యవస్థ కోల్పోనున్నది.