గోల్నాక, నవంబర్ 22: కూతురి మరణం తట్టుకోలేక తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన దంపతులు తమ పదిహేనేండ్ల కూతురుతో కలసి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కే శ్రీనివాస్(45), విజయలక్ష్మి(40) దంపతులు.. ముషీరాబాద్ రాంనగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి కావ్య(18), శ్రావ్య(15) ఇద్దరు కూతుళ్లు. అంతా సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.
గతకొన్నేళ్లుగా మానసికంగా కుంగిపోయిన వీరి పెద్ద కూతురు కావ్య నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. దీంతో తీవ్ర దుంఖంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు రెండునెలల క్రితం బాగ్ అంబర్‌పేటలోని రామకృష్ణనగర్‌కు వచ్చి అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అప్పటినుంచి పెద్ద కూతురు జ్ఞాపకాలతో కుమిలిపోతూ.. ఆ బాధను తట్టుకోలేక గురువారం శ్రీనివాస్ దంపతులు.. తమ చిన్న కూతురు శ్రావ్యతో కలసి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకుపాల్పడ్డారు. శనివారం శ్రీనివాస్ ఇంట్లో నుంచి తీవ్ర దుర్గందం రావడంతో ఇరుగు పొరుగు వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. కేసు దర్యాప్తు చేస్తున్నారు.