సిటీబ్యూరో, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ): ఒడిశా నుంచి గంజాయి దిగుమతి చేసుకున్న ఓ వ్యక్తిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.12లక్షల విలువజేసే 25.230కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ధూల్‌పేటకు చెందిన ఆకాశ్‌సింగ్ ఒడిశా నుంచి గంజాయి దిగుమతి చేసుకుని వెళ్తుండగా.. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ బృందం ధూల్‌పేటలోని రాణి అవంతిబాయ్ విగ్రహం సమీపంలో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు.
అతడి వద్ద నుంచి రూ.13లక్షల విలువ జేసే 25.230కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న లఖన్ సింగ్ , సంజయ్ సింగ్ , జ్యోతి బాయ్ , ఆనంద్ సింగ్ , మణిశ్ సింగ్, దీప, నిరంజన్ కుమార్లపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్ ఈఎస్ అంజి రెడ్డి తెలిపారు.
మరో కేసులో…
జియాగూడ పీలా కాశీ శివ్మందిర్ సమీనంలో గంజాయిని అమ్మకాలు జరుపుతున్న భద్రీనారాయణ్ సింగ్‌ను ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.50వేలు విలువజేసే 1.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బంగ్లా వాలా అజయ్ సింగ్ , మంజు దేవిలకు సంబంధం ఉండటంతో వారిపై కూడా కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ రెండు కేసులను ధూల్‌పేట ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.