చార్మినార్, ఆగస్టు 3 : పనిచేస్తున్న సంస్థకు టోకరా వేసి.. 55 తులాల బంగారు నగలతో ఉడాయించిన నిందితుడిని విశాఖలో హుస్సేనీఆలం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని గుర్తించిన పోలీసులు సుమారు 26 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ రుద్రభాస్కర్, ఇన్స్పెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండికా అడ్డా ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన తారక్నాథ్ బేరా బంగారం పనులు (గోల్డ్‌స్మిత్) చేస్తున్నాడు.
అతడి వద్ద పశ్చిమ బెంగాల్‌కు చెందిన కోకన్ మాజీ అలియాస్ సిరాజ్ (35) నెలరోజుల కిందటే బంగారు ఆభరణాలకు మెరుగులద్దే పనుల కోసం చేరాడు. నెలరోజులుగా యజమాని చెప్పిన పనులన్నీ చేస్తూ నమ్మకంతో ఉన్నాడు. ఈ క్రమంలో గతనెల 27న సుమారు 55 తులాల బంగారు ఆభరణాలకు మెరుగులద్దాలని తారక్నాథ్ బేరా చెప్పి సిరాజ్‌కు నగలు అప్పగించాడు. ఆ నగలను మూట కట్టుకున్న సిరాజ్ రైలు ఎక్కి విశాఖకు పారిపోయాడు. సిరాజ్ పారిపోయిన విషయాన్ని గుర్తించిన తాకర్నాథ్ వెంటనే హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు విశాఖలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. విశాఖ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అప్పటికే బంగారు ఆభరణాలను కరిగించిన నిందితుడు.. నగలను కడ్డీలా మార్చివేశాడు. విశాఖకు చేరుకున్న హుస్సేనీఆలం పోలీసులు.. తొలుత నిందితుడిని అక్కడి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో తిరిగి హైదరాబాద్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 33 తులాల బంగారు కడ్డీతోపాటు ఆభరణాలను కరిగించడానికి ఉపయోగించే గ్యాస్ బర్నల్, ఎయిర్ గన్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై నవీన్‌తోపాటు కానిస్టేబుళ్లకు ఏసీపీ రుద్రభాస్కర్ రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, అడిషనల్ ఇన్స్పెక్టర్ వీరభద్రం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.