మేడ్చల్, ఫిబ్రవరి14(నమస్తే తెలంగాణ): దేవాదాయ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు మేడ్చల్ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మేడ్చల్ జిల్లాలోని దేవాదాయ భూముల్లో సుమారు 221 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు రెవెన్యూ యంత్రాంగం గుర్తించినట్లు సమాచారం. రెవెన్యూ యంత్రాంగం గుర్తించిన అక్రమ నిర్మాణాల నివేదికపై జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులతో ఇటీవలే సమీక్ష నిర్వహించారు. నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
జిల్లాలో 1620 ఎకరాల దేవాదాయ భూములు ఉండగా, అత్యధికంగా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్లోనే 1,531 ఎకరాల దేవాదాయశాఖ భూమి ఉంది. దేవాదాయ భూములు వందలాది ఎకరాలు కబ్జాలకు గురికాగ..దేవాదాయ భూముల రక్షణకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల చే త్రీసభ్య కమిటీని నియమించగా, దేవాదాయ భూములు కబ్జాలు గురైన వాటిని గుర్తించి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో త్రీసభ్య కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగానే అధికారులు భూములతో పాటు అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు తెలుస్తున్నది. దేవరయాంజల్లో 55 నుంచి 63 639-641, 656-657, 660 -682, 686-718, 736 సర్వే నంబర్లలో ఉన్న భూమి దేవాదాయ భూమిగా గుర్తించారు. ఇందులో సుమారు 221 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు జిల్లా రెవెన్యూ యంత్రాంగం తేల్చినట్లు తెలుస్తున్నది. అక్రమ నిర్మాణాలపై పూర్తి ఆధారాలతో సిద్ధం చేసిన నివేదికపై ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.