సిటీబ్యూరో, జూలై 24, (నమస్తే తెలంగాణ): నగర పర్యావరణ పరిరక్షణలో భాగంగా పక్షుల జీవ వైవిధ్య పరిస్థితులు, వాటి సంఖ్యను తెలుసుకునేందుకు హైదరాబాద్ బర్డ్స్ అట్లాస్(హెచ్‌బీఏ) సర్వే నిర్వహించగా సిటీ మొత్తంలో 218 రకాలకు చెందిన 1,36,000 లక్షల పక్షులు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఉన్న పక్షులను గుర్తించేందుకు హెచ్‌బీఏ సంస్థ 2025లో రెండు సీజన్లలో సర్వే చేపట్టింది.
ఇందులో భాగంగా ఫిబ్రవరిలో జరిగిన మొదటి సీజన్లో 209 మంది వలంటీర్లు నగరవ్యాప్తంగా 180 ప్రదేశాల్లో పక్షుల గణన చేపట్టారు. వారు చేపట్టిన సర్వేలో 195 రకాలకు చెందిన 79,187 పక్షులు ఉన్నట్లు గుర్తించారు. తరువాత జూన్ నెలలో రెండో సీజన్లో చేపట్టిన సర్వేలో 225మంది వలంటీర్లు 166 రకాలకు చెందిన 62,811 పక్షులను గుర్తించారు. మొదటి సర్వేలో నగరంలోని చెరువులు, అటవీ ప్రాంతాలు, పచ్చదనం ప్రాంతాల్లో వలస పక్షులు అధికంగా కనిపించగా, రెండో సర్వేలో మాత్రం వలస పక్షులు లేకపోవడం మూలంగా పక్షుల సంఖ్య తగ్గటం గమనార్హం.
బ్రీడింగ్, గూడ్ల నిర్మాణం వాతావరణ మార్పుల వంటి కీలక అంశాలపై సమాచారం సేకరించినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. రెండో సీజన్లో అశీ ప్రినియా, రెడ్ వెంటెడ్ బల్బుల్, స్పాటెడ్ డౌవ్, రాక్ పిజన్, ఏషియన్ కోయిల్ పక్షులు అధికంగా కనిపించగా, బయా వీవర్, హౌస్ క్రో, స్కేలీ బ్రెస్టెడ్ మునియా, ఈస్ట్రన్ క్యాటిల్ ఇగ్రెట్ వంటి రకాలకు చెందిన పక్షులు ఉండటం గమనార్హం. ఇందులో డెక్కన్ బర్డర్స్, ఇండియా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వారి భాగస్వామ్యం ఉండటం విశేషం. ఈ సర్వే మరో రెండేళ్లపాటు కొనసాగునందని నిర్వాహకులు తెలిపారు.