శనివారం 30 మే 2020
Hyderabad - Mar 26, 2020 , 00:31:12

బయటకొస్తే చెప్పండి.!

బయటకొస్తే చెప్పండి.!

  • పండుగరోజూ.. అదే కట్టడి..!
  • ఫైర్‌ ఇంజన్‌ ద్వారా హైపోక్లోరైట్‌ పిచికారి
  • నిరంతర పనుల్లో 120 బృందాలు
  • 300 మంది ఈవీడీఎంకు చెందిన ఉద్యోగులు
  • హోమ్‌ క్వారంటైన్లపై నిఘా పెంపు
  • ఇండ్లకు నోటీసులు అంటిస్తున్న నిఘా బృందాలు

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్రిమి సంహాకర రసాయనాల పిచికారీలో జీహెచ్‌ఎంసీ అధికారులు పండుగ రోజైన బుధవారం సైతం ఆదే జోరును కొనసాగించారు. ఇప్పటివరకు సమస్యాత్మక ప్రాంతాల్లో పవర్‌ స్ప్రేయర్లు, నాప్‌సాక్‌ స్ప్రేయర్లు, జెట్‌ మిషర్లు, అధునాతన యంత్రంతో కూడిన ట్రాక్టర్‌ తదితరవాటి ద్వారా సోడియం హైపోక్లోరైట్‌ను స్ప్రే చేస్తుండగా, తాజాగా బుధవారం చందానగర్‌ ప్రాంతం వీధుల్లో ఫైర్‌ ఇంజిన్‌ ద్వారా సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేశారు. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలు, హోమ్‌ క్వారంటైన్‌లు, ప్రభుత్వ క్వారంటైన్‌లు, దవాఖానలు తదితర ప్రాంతాలే కేంద్రంగా జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున సోడియం హైపోక్లోరైట్‌ను స్ప్రే చేస్తున్న విషయం విధితమే. దీంతోపాటు మెలాథియన్‌ను డీజిల్‌లో కలిపి విస్తృతంగా ఫాగింగ్‌ నిర్వహిస్తున్నారు. కొండాపూర్‌ కిమ్స్‌ హాస్పిటల్‌, చందానగర్‌ తదితర ప్రాంతాల్లో ఫైర్‌ ఇంజన్‌ ద్వారా క్రిమి సంహారక సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారీ చేశారు. ఆర్కేపురం డివిజన్‌ పరిధిలోని గ్రీన్‌హిల్స్‌కాలనీ, వాసవీకాలనీ, చందానగర్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌ అష్టలక్ష్మీ టెంపుల్‌ తదితర ప్రాంతాలతోపాటు హోమ్‌ క్వారంటైన్‌లు, ప్రభుత్వ క్వారంటైన్‌లు ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా ఈ రసాయనాలను స్ప్రే చేశారు. చందానగర్‌లో స్థానిక ఎమ్మెల్యే గాంధీ ఆధ్వర్యంలో అధికారులు ఫైర్‌ ఇంజన్‌ ద్వారా రసాయనాలు పిచికారీ నిర్వహించారు. అంతేకాకుండా శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలోని యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్‌లో సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రేయింగ్‌ నిర్వహించారు. కింగ్‌ కోఠి దవాఖాన, అబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ తదితర ప్రాంతాల్లో ఫాగింగ్‌ నిర్వహించారు. జీహెచ్‌ఎంసీకి చెందిన ఎంటమాలజీ, ఈవీడీఎం(ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) విభాగం సిబ్బంది అత్యవసర పనుల్లో నిమగ్నమైన విషయం విధితమే. ఓ వైపు లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా, మరోవైపు క్రిమి సంహారక మందు పిచికారీ విరివిగా కొనసాగిస్తున్నారు. ఎంటమాలజీ విభాగానికి చెందిన 19మంది సభ్యులతో కూడిన 120 బృందాలు, ఈవీడీఎంకు చెందిన 300మంది ఉద్యోగులు క్రిమిసంహారక స్ప్రే చర్యల్లో పాల్గొంటున్నారు. 

హోమ్‌ క్వారంటైన్లపై నిఘా, గోడలకు నోటీసులు

హోమ్‌ క్వారంటైన్లలో ఉన్నవారు తరచూ బయట తిరుగుతుండటంతో వారిపై నిఘా పెంచారు. మంగళవారం వివిధ ప్రాంతాల్లో ఈ తరహా నలుగురిని గుర్తించి హోమ్‌ క్వారంటైన్‌ నుంచి ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించిన విషయం విధితమే. దీంతో అధికారులు హోమ్‌ క్వారంటైన్‌లలో ఉంటున్నవారు బయటకు వెళ్లకుండా ఇరుగు-పొరుగు వారిని మరింత అప్రమత్తం చేస్తున్నారు. వారు ఏ మాత్రం బయట తిరిగినట్లు గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఇటువంటివారి పాస్‌పోర్టులను రద్దుచేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, తాజాగా హోమ్‌ క్వారంటైన్‌లకు ఇతరులు వెళ్లకుండా ఉండేందుకు ఆ ఇంటికి నోటీసులు అంటిస్తున్నారు. దీంతో ఎవ్వరూ ఆ ఇంటి పరిసరాల్లోకి వెళ్లే వీలు ఉండదని, అంతేకాకుండా వారు బయట తిరిగినా వెంటనే సమాచారం ఇచ్చే వీలు కలుగుతుందని అధికారులు వివరించారు.logo