సోమవారం 30 మార్చి 2020
Hyderabad - Feb 21, 2020 , 03:55:16

వాణిజ్య నల్లాలకు స్మార్ట్‌ మీటర్లు

వాణిజ్య నల్లాలకు స్మార్ట్‌ మీటర్లు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వాణిజ్య కేటగిరి నల్లాల(25ఎంఎం పైపుసైజు పై కేటగిరి)కు స్మార్ట్‌ మీటర్లు బిగించనున్నారు. ఆటోమెటిక్‌ మీటర్‌ రీడింగ్‌(ఏఎంఆర్‌) విధానంలో మరింత సాంకేతికతకు జలమండలి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏఎంఆర్‌ మీటర్లతో గాలితో రీడింగ్‌ రావడం, పలు సాంకేతిక సమస్యల కారణంగా మీటర్‌ రీడింగ్‌లో లోపాలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో వినియోగదారులు, ఇటు సంస్థకు మరింత సౌకర్యవంతంగా ఉండే లోరా టెక్నాలజీ వైపు మొగ్గు చూపారు. సెన్సార్‌ ఆధారంగా ఖైరతాబాద్‌ సెంట్రల్‌ సర్వర్‌ అనుసంధానం చేసి వాణిజ్య నల్లాల నీటి సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. ప్రతి నీటి బొట్టునూ లెక్కలోకి తీసుకువచ్చి సంస్థ ఆదాయాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు స్మార్ట్‌ మీటర్ల బిగింపు ప్రక్రియకు సంబంధించి టెండర్లను ఆహ్వానించారు. త్వరలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్మార్ట్‌ మీటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.  


ప్రతి నీటి బొట్టూ లెక్కలోకి.. 

నెలవారీ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా జలమండలి చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే అక్రమ నల్లాల ఏరివేత, ఏఎంఆర్‌ మీటర్ల బిగింపు చేపడుతున్న రెవెన్యూ విభాగం అధికారులు తాజాగా సంస్థ నెలవారీగా ఆదాయంలో కీలకమైన బల్క్‌, ఇండస్ట్రీయల్‌, కమర్షియల్‌ కేటగిరి నల్లాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న కనెక్షన్లకు డిమాండ్‌కు అనుగుణంగా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ మీటర్లు లేని కారణంగా నెలవారీ ఆదాయంలో సంస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. అన్ని నల్లాలకు మీటర్లు బిగించడంతోపాటు పరిశ్రమలు, వ్యాపార రంగ సంస్థలు భారీగా వస్తున్నా.. కనెక్షన్ల సంఖ్య మాత్రం పెరగడంలేదని, ఆదాయం పెరగకపోవడానికి ఇదో కారణమని విశ్లేషించారు. ఈ క్రమంలోనే బల్క్‌, ఇండ్రస్టీయల్‌, కమర్షియల్‌ నల్లాలపై క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని ఎండీ దానకిశోర్‌ నిర్ణయించారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, విద్యుత్‌, ఐలా వారి సమన్వయంతో ఇండస్ట్రీయల్‌, కమర్షియల్‌ కనెక్షన్లను గుర్తించారు. అన్ని కనెక్షన్ల నుంచి నెలకు రూ.6 కోట్ల ఆదాయం వస్తుందని, అన్నింటికీ మీటర్లు, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో అదనంగా మరో రూ.4కోట్ల మేర ఆదాయం పెంచాలన్న నిర్ధేశిత లక్ష్యంగా ఈ సర్వే జరిపారు.


logo