సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ) : గంజాయి రవాణా చేస్తున్న ఒక పాత నేరస్తుడిని ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 20.6కిలోల గంజాయితో పాటు కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ అంజిరెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన జలీలుద్దీన్ సిద్ధిఖీ అహ్మమద్ హుస్సేన్ మెషిన్ ఆపరేటర్. వచ్చే జీతం సరిపోవడంతో ఉద్యోగం చేస్తూనే సైడ్ బిజినెస్‌గా వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతూ 2023లో అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆబ్కారీ పోలీసులకు పట్టుపడ్డాడు. ఆ కేసులో జైలు శిక్ష అనుభవించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఈ క్రమంలో ఏపీలోని సీలేరులో లక్ష్మీబాయి అనే మహిళ వద్ద 20.6 కేజీల గంజాయి కొనుగోలు చేసి, అక్కడి నుంచి నగరం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు సంగారెడ్డి పోతురెడ్డిపల్లిలో నిందితుడు ప్రయాణిస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 20.6కిలోల గంజాయితో పాటు కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయించిన లక్ష్మీబాయి, కృష్ణలపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం సంగారెడ్డి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.