సిటీబ్యూరో: ముంబైకి సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్.. ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌తో పాటు ఇతరుల వీడియోలను ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో చూసి..ఉన్మాదిగా మారాడని..హిందూ మతంపై ద్వేషం పెంచుకున్నాడని విచారణలో వెల్లడయ్యిందని నగర పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోకి చొరబడిన సలీం.. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి తన ఉన్మాదాన్ని చూపించిన విషయం తెలిసిందే.
విచారణలో నిందితుడి పేరు సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్ అని ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ముంబైలోని ముంబ్రా ప్రాంతంలో నివాసముంటున్నట్లు వెల్లడైంది. సికింద్రాబాద్‌లోని మెట్రో పోలీస్ హోటల్లో ఇంగ్లిష్ హౌస్ అకాడమీ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ఈ నెల మొదటి వారంలో వచ్చినట్లు తేలింది. జకీర్ నాయక్ వంటి వారి ప్రసంగాలు సామాజిక మాధ్యమాల్లో చూసి హిందూ మతంపై ద్వేషం పెంచుకున్నాడు.
ముంబైలోనూ ఆరే సబ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గణేశ్ మండపంలోకి కాళ్లకు చెప్పులు వేసుకొని ప్రవేశించి విగ్రహారాధనను అవమానిస్తూ స్థానికులతో గొడవకు దిగడం, అలాగే వసాయి, విరార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మనోకామన సిద్దిమహాదేవ్ మందిరంలోకి ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేశాడని.. ఈ రెండు ఘటనలపై ముంబైలో కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉన్నదని, అనవసర ఊహాగానాలు, వదంతులను వ్యాప్తి చేయాకూడదని పోలీసులు ప్రజలను కోరారు.