సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 88 విన్నపాలు రాగా.. అందులో అత్యధికంగా హౌసింగ్/ లేక్స్ విభాగానికి 43, టౌన్‌ప్లానింగ్ 23, ట్యాక్స్ సెక్షన్ 8, ఈఎన్సీ మూడు, ఎల్డబ్ల్యూఎస్, ఎఫ్ఏ శానిటేషన్ విభాగాలకు సంబంధించి రెండు చొప్పున, సీఎం అండ్ హెచ్ఓ, ఎలక్ట్రికల్, ఎస్టేట్, వెటర్నరీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున విన్నపాలు వచ్చాయి. ఇక ఆరు జోన్ల పరిధిలో 89 అర్జీలను అధికారులు స్వీకరించారు. కూకట్‌పల్లిలో 42, శేరిలింగంపల్లిలో 16, సికింద్రాబాద్‌లో 14, ఎల్బీనగర్లో 9, చార్మినార్‌లో ఆరు, ఖైరతాబాద్‌లో రెండు ఫిర్యాదులు అందాయి.
ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా నాలుగు విన్నపాలు రాగా.. సంబంధిత అధికారులకు పంపించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిష్కారం కానట్లయితే అందుకు గల కారణాలను లిఖిత పూర్వకంగా తెలిపాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, యాదగిరి రావు, చంద్రకాంత్‌రెడ్డి, పంకజ, సత్యనారాయణ, సీసీపీ శ్రీనివాస్, అడిషనల్ సీసీపీ గంగాధర్, చీఫ్ వెటర్నరీ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్ ఆయా విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అనధికారిక నిర్మాణాల నియంత్రణలో జీహెచ్ఎంసీ విఫలం చెందిందని, టౌన్‌ప్లానింగ్‌లో కొందరు అధికారుల తీరుతో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు పెరిగాయంటూ అర్జీదారులు గడిచిన కొంతకాలంగా ప్రజావాణి వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాంనగర్ వాసి తగరం అనిల్‌కుమార్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న అనిల్‌కుమార్‌ను వెంటనే అక్కడున్న విజిలెన్స్ విభాగం అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకొని వాటర్ బాటిళ్ల నీటిని చల్లి రక్షించారు.
జీహెచ్ఎంసీ సర్కిల్-15 పరిధిలోని రాంనగర్ ఇండస్ట్రీయల్ కాలనీ ఇంటి నం. 1-9-19లో బీఆర్ సుభాష్‌బాబు అనే నిర్మాణదారు ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు. ప్రతి అంగుళం చట్ట విరుద్దంగా, నియమ నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపడుతున్నాడని, ఈ పనులు నిలిపివేయాలని సుభాష్బాబుపై అనిల్‌కుమార్ ఫిర్యాదు చేస్తూ వచ్చాడు. నిర్మాణం చేపడుతున్న 430 గజాల భూమిలో తమ తల్లికి సంబంధించిన వాటా ఇవ్వకుండానే నిర్మాణం చేపడుతున్నాడని, ఆస్తి పంపకాల అంశాన్ని కాకుండా అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అనిల్‌కుమార్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
సిటీబ్యూరో, అక్టోబర్ 28 ( నమస్తే తెలంగాణ ): డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తమకు కేటాయించాలని కోరుతూ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణికి దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయి. మొత్తం 268 దరఖాస్తులు రాగా.. అందులో 218 దరఖాస్తులు ఇండ్లకు సంబంధించినవే ఉండటం గమనార్హం. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లో లబ్ధిదారులను కాదనీ.. తమకు వద్దని చెబుతున్నా మూసీ బాధితులకు బలవంతంగా కేటాయిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు వస్తుందని ఎదురుచూస్తున్నాం.. అధికారులు ఇప్పుడు ఇండ్లను కేటాయించడం కుదరదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండ్లు కేటాయించాలని కోరుతూ అధికారులకు దరఖాస్తులను అందజేశారు. డబుల్ బెడ్రూమ్ల కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత గృహ నిర్మాణ శాఖకు పంపించి పరిశీలించాలని అదనపు కలెక్టర్ కదిరవన్ అధికారులను ఆదేశించారు.